దేశంలో టీకా పంపిణీ 100 కోట్ల డోసులు దాటిన క్రమంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడికి దక్కుతుందన్నారు.
భారత దేశం 100 కోట్ల డోసుల టీకా పంపిణీ మైలురాయిని అందుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిదారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఈ ఘనత సాధించేందుకు దోహదపడిన వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరులో దేశ ప్రజలకు 100కోట్ల టీకాల 'సురక్షిత కవచం' లభించిందన్నారు.
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి ప్రధాని మోడీ చేరుకుని హెల్త్ కేర్ వర్కర్స్‌తో మాట్లాడి అభినందించారు. కొవిడ్ టీకాల పంపిణీలో కీలక పాత్ర పోషించిన వైద్యారోగ్య సిబ్బందిపై మోడీ ప్రశంసల జల్లు కురిపించారు.
ఇదేసమయంలో ఓ దివ్యాంగురాలిని కూడా మోడీ దీవించారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మోడీకి 25 ఏండ్ల ఛావీ అగర్వాల్ తారసపడింది. దీంతో మోడీ అక్కడ ఆగి.. దివ్యాంగురాలితో పాటు ఆమె తల్లి పూనమ్ అగర్వాల్‌ను ఆప్యాయంగా పలుకరించారు.
ఎందుకు వచ్చావని మోడీ ఆమెను ప్రశ్నించగా.. టీకా కోసమని చెప్పింది. ఇంత ఆలస్యంగా టీకా ఎందుకు తీసుకుంటున్నావని మోడీ అడగ్గా.. దగ్గు కారణంగా తీసుకోలేకపోయానని ఛావీ సమాధానం ఇచ్చింది. నీ హాబీస్ ఏంటని మోడీ ప్రశ్నించగా.. పాటలు పాడటమంటే ఇష్టమని చెప్పింది. దీంతో ఒక పాట పాడాలని మోడీ ఆమెను కోరగా.. యే మేరే వతన్ కే లోగోన్ అనే పాటను ఆలపించింది ఛావీ.
అనంతరం ఆమెను మోడీ దీవించి.. త్వరలోనే తప్పకుండా కలుస్తానని ఛావీకి మాటిచ్చారు. వ్యాక్సినేషన్ వంద కోట్ల మార్కు దాటిన రోజు ఛావీకి ప్రత్యేకమైంది. మోడీ ఆమెను పలుకరించి, మాట్లాడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఛావీ పేర్కొన్నారు.