ప్రధాని మోడీకి షాకిచ్చిన బీజేపీ ఎంపీలు.. ఎక్కడ.. ఎందుకు?
భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చారు. పెద్దల సభ అయిన రాజ్యసభలో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం తెలుపాల్సి ఉన్న తరుణంలో బీజేపీ ఎంపీలు సభకు డుమ్మా కొట్టారు.
భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చారు. పెద్దల సభ అయిన రాజ్యసభలో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం తెలుపాల్సి ఉన్న తరుణంలో బీజేపీ ఎంపీలు సభకు డుమ్మా కొట్టారు. దీంతో విపక్షాలు సూచించిన కొన్ని సవరణలతో బిల్లు పాస్ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. నిజానికి బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో అరకొరగానే మెజార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి చెందిన ఎంపీలే డుమ్మా కొట్టడంతో మోడీ సర్కారు ఇరుకునపడినట్టయింది.
ముఖ్యంగా బీసీ కమిషన్‌ను చట్టబద్ధ సంస్థ హోదా నుంచి రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చడానికి ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందడానికి సభలో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. రాజ్యసభలో సవరణలతో ఆమోదం పొందిన బిల్లు మరోసారి లోక్‌సభకు పంపిస్తారు.
బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ సంస్థ హోదా వచ్చిందంటే అది కోర్టుతో సమానం. బీసీలపై ఏవైనా హింసాత్మక ఘటనలు, వివక్ష కేసుల్లో బాధ్యులకు నేరుగా సమన్లు జారీ చేయడంతోపాటు విచారణకు కూడా ఆదేశించవచ్చు. అంతటి ప్రాధాన్యత కలిగిన బిల్లుపై ఓటింగ్ సందర్భంగా 30 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా కొట్టారు.