ఇక బినామీల భరతం పడతా : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నల్లకుబేరులకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నల్లకుబేరులతో పాటు.. బినామీలకు హెచ్చరిక జారీచేశారు.
పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నల్లకుబేరులకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నల్లకుబేరులతో పాటు.. బినామీలకు హెచ్చరిక జారీచేశారు. ఇందులోభాగంగా, బినామీ ఆస్తులను నియంత్రించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని ఆయన ప్రకటించారు. అవినీతిపై తాము ప్రకటించిన యుద్ధానికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
నెలనెలా రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో భాగంగా ఆదివారం ప్రసంగించిన ఆయన అక్రమ సంపాదనాపరులను ప్రజలు అందించే సమాచారం ద్వారానే నియంత్రించగలమన్నారు. ఈ సందర్భంగానే ఆయన నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపార్ యోజన పథకాలను ప్రారంభించారు. నోట్ల రద్దుకు సంబంధించిన నిబంధనల్లో తరచుగా మార్పులు చేపట్టడాన్ని ఆయన సమర్థించారు.
ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి, అక్రమాలకు పాల్పడే శక్తులను నియంత్రించడానికి అవి అవసరమని చెప్పారు. ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు అనేది అవినీతిపై తన ప్రభుత్వం చేపట్టిన యుద్ధంలో తొలి అడుగు మాత్రమేనని ప్రధాని పునరుద్ఘాటించారు. ఇది ముగింపు కాదని నేను మీకు హామీ ఇస్తున్నాను. అవినీతిపై పోరులో ఇది ప్రారంభం మాత్రమే. అవినీతిపై, అక్రమ ధనంపై యుద్ధంలో మనం గెలువాలి. ఈ పోరాటాన్ని ఆపే లేదా వెనుకకుపోయే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు.