దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. అయినప్పటికీ ఈ వైరస్ నుంచి విముక్తి పొందిన రాష్ట్రాల్లో గోవా ఒకటి. కరోనాను బాగా కట్టడి చేసిన రాష్ట్రంగా గోవా గుర్తింపు పొందింది. దీంతో గోవాలో పర్యాటకుల సందర్శనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకునేందుకు కూడా పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చింది.
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ, సరదాగా గడపడానికి, లాడ్జీల్లో ఎంజాయ్ చేసేందుకు అయితే తమ రాష్ట్రానికి రావొద్దని కోరారు. అలా వచ్చినవారిని తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారైంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు.
న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తున్న ప్రత్యేక రైలులో 720 మంది మార్గావ్ వరకు టికెట్లు బుక్‌చేసుకున్నారని, వారిలో గోవాకు చెందినవారు ఒక్కరు కూడా లేరనే విషయాన్ని గ్రహించినట్టు తెలిపారు.
ఢిల్లీలో ఈ రోజు బయల్దేరిన ప్రత్యేక రైలు రేపు తిరువనంతపురం చేరుకోనుంది. మార్గావ్‌లో రైలు ఆపకూడదని తాము ఇప్పటికే రైల్వేశాఖను కోరామని తెలిపారు. ఇలా వచ్చేవారిలో గోవా పౌరులతోపాటు, రాష్ట్రానికి చెందనివారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచుతామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.