దేశ పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతా దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొనివున్నాయని, ఇలాంటి నేపథ్యంలో ఈ తరహా పిటిషన్లు ఏమీ చేయలేవన్నారు. అయితే దేశవ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు ఆగితేనే, పౌరసత్వ సవరణ చట్టం వర్తింపు అంశంపై పిటిషన్లు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ తెలిపారు.
అసలు పార్లమెంట్‌లో పాసైన ఓ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని ఎలా ప్రకటిస్తారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ప్రస్తుతం శాంతిని నెలకొల్పేందుకే మనం ప్రయత్నించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా ఇచ్చారు.
కాగా, సీఏఏను రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని న్యాయవాది వీనత్ ధండా తన పిటిషన్‌లో కోరారు. సీఏఏపై దుష్ ప్రచారం నిర్వహిస్తున్న కార్యకర్తలు, విద్యార్థులు, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.