Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దినకరన్‌, పళనిస్వామి తోడుదొంగలు ... ధర్మయుద్ధం కొనసాగుతుంది : పన్నీర్ ప్రకటన

అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిలు తోడు దొంగలని అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ) నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం ధ్వజమెత్తారు.

దినకరన్‌, పళనిస్వామి తోడుదొంగలు ... ధర్మయుద్ధం కొనసాగుతుంది : పన్నీర్ ప్రకటన
, బుధవారం, 3 మే 2017 (10:27 IST)
అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిలు తోడు దొంగలని అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ) నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేను కొందరి నుంచి విడిపించేందుకు ప్రారంభించిన ధర్మయుద్ధం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. 
 
ఆ పార్టీ తరపున నగరంలో జరిగిన ఓ కార్యక్రంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... రాష్ట్రాన్ని 27 ఏళ్లపాటు పరిపాలించిన ఘనత అన్నాడీఎంకే నేతలు ఎంజీఆర్‌, జయలలితలకు దక్కుతుందన్నారు. జయలలిత మరణానంతరం ఆమె ప్రజాపాలనతత్వం, మార్గదర్శకత్వం మేరకు పార్టీ కొనసాగుతుందన్నారు. ఒక కుటుంబం కబంధ హస్తంలో పార్టీ, పాలన చిక్కుకోకూడదని అందరూ భావించారని, అయితే అదే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం ఆ కుటుంబ కబంధ హస్తం నుంచి పార్టీని, పాలనను విడిపించడానికి ప్రారంభించిన తమ ధర్మయుద్ధం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. ఇందులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్కేనగర్‌ నియోజకవర్గంలో తమ అభ్యర్థి మధుసూదన్‌కు ప్రజలు పూర్తిస్థాయి మద్దతిచ్చారని, దీంతో భయపడిన టీటీవీ దినకరన్‌ వర్గం ఓటుకు రూ.4 వేలు, డీఎంకే రూ.2 వేలు పంచాయని ఆరోపించారు. ఆర్కేనగర్‌ ఎన్నిక ఎప్పుడు జరిగినా విజయం తమదేనని, మధుసూదన్‌ గెలిచి తీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
ప్రజాభీష్టం మేరకు టీటీవీ దినకరన్‌ను దూరంగా ఉంచినట్లు చెబుతున్నారని, అయితే ఎన్నికల సంఘం వద్ద దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ పేర్లను తొలగించలేదని, అదనంగా ఎడప్పాడి పళనిస్వామి పేరు మాత్రమే చేర్చారని పేర్కొన్నారు. విలీనం పేరిట నాటకం ఆడారని, ఇలాంటి వారిని ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. టీటీవీ దినకరన్‌, ఎడప్పాడి పళనిస్వామి తోడు దొంగలని ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ స్టైల్‌లో పెళ్లి.. దారిలో ఉన్నారని.. వివాహతంతు ముగించేశాడు.. కానీ జైలుకెళ్లాడు..