Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు ప్రారంభం: డీఎంకే మద్దతుతో ఢిల్లీకి పయనం

తమిళనాడు రాజకీయాల్లో అసలైన ముసలం ఇప్పుడు మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత నెచ్చెలి శశికళపై తిరుగుబాటు ప్రకటించారు. అమ్మ జయలలిత ప్రసాదించిన ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను తీసేసే హక్కు ఎవరికీ లేదని హుంకరించిన సెల్వం అటో ఇటో తేల్చుకునే ప్ర

శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు ప్రారంభం: డీఎంకే మద్దతుతో ఢిల్లీకి పయనం
హైదరాబాద్ , బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (03:24 IST)
తమిళనాడు రాజకీయాల్లో అసలైన ముసలం ఇప్పుడు మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత నెచ్చెలి శశికళపై తిరుగుబాటు ప్రకటించారు. అమ్మ జయలలిత ప్రసాదించిన ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను తీసేసే హక్కు ఎవరికీ లేదని హుంకరించిన సెల్వం అటో ఇటో తేల్చుకునే ప్రయత్నాలకు మంగళవారం రాత్రి నుంచే నాంది పలికారు. ఇప్పటికే 62 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలను కూడగట్టిన పన్నీర్ సెల్వం తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలను రచిస్తూ ఢిల్లీకి వెళ్లడానికి కూడా సిద్ధమయ్యారు. బుధవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రులను కలుసుకుని, మంత్రివర్గ ఏర్పాటుకై వినపత్రం ఇవ్వనున్నట్లు స్పష్టంగా సమాచారం వస్తోంది. శశికళను ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని చేయరాదని నిన్న ఢిల్లీదాకా వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మద్దతు ఇస్తే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయడం పెద్ద కష్టం కాదని విశ్లేషకుల అంచనా.
 
జయ సమాధి వద్ద మీడియా సమావేశం అనంతరం నేరుగా తన నివాసానికి వెళ్లిపోయిన పన్నీర్‌ సెల్వంను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన కీలకనేతలు సైతం పన్నీర్‌ ఇంటికి క్యూకట్టారు. వారిలో అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌, సీనియర్‌ ఎంపీ మైత్రేయన్‌ లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సెల్వం మీడియాతో మాట్లాడుతూ నన్ను పదవి నుంచి తీసేసే హక్కు మీకెవరిచ్చారంటూ శశికళకే ప్రశ్నలు సంధించారు. 
 
 235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష డీఎంకే నుంచి 89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌పార్టీకి 8, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. పన్నీర్‌ ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకు కనీసం 117మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆయనకు 62 మంది ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు పలుకుతున్నారు. అంటే, మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇంకా 55 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అత్యధికులు శశికళ అనుచరులే కావడం వల్ల వారు పన్నీర్‌ను సపోర్ట్‌చేసే అవకాశాలు తక్కువ. ఈ పరిస్థితుల్లో ఆయనకున్న ఓకేఒక్క పెద్ద అండ.. ప్రతిపక్ష డీఏంకే!
 
నాలుగు రోజుల కిందట పన్నీర్‌ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు అందరికంటే ముందుగా స్పందించింది ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్ స్టాలినే! శశికళను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఎంతదూరమైనా వెళతామని ప్రకటించిన స్టాలిన్‌.. తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్‌తో మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. 'ఉంటే, గింటే పన్నీర్‌ సెల్వమే సీఎంగా ఉండాలికానీ, శశికళను ప్రజలు స్వీకరించరు'అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తద్వారా అడగకనే పన్నీర్‌కు తన మద్దతు ప్రకటించారు.
 
పన్నీర్‌ సెల్వం తిరిగి పీఠం ఎక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన దరిమిలా సభలో బలనిరూపణ కీలక అంశంగా మారుతుంది. శశికళ పట్ల వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టడానికి కూడా స్టాలిన్ సిద్ధం కానున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం సునాయాసంగా ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత బుగ్గపై ఆ చుక్కల గురించి ఇప్పుడెందుకు చర్చ?