జయలలిత పార్టీ లేదు... శశికళకు 'అమ్మ' - ఓపీఎస్‌కు 'పురట్చితలైవి అమ్మ'
ముఖ్యమంత్రి దివంగత జయలలిత వారసత్వం కోసం సాగుతున్న ఆధిపత్య పోరులో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ముఖ్యమంత్రి దివంగత జయలలిత వారసత్వం కోసం సాగుతున్న ఆధిపత్య పోరులో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో రెండాకులు గుర్తుతో పాటు.. అన్నాడీఎంకే పేరుతో ఉన్న పార్టీని కూడా స్తంభింపజేసింది. అదేసమయంలో వారిద్దరికి వేర్వేరు పార్టీ పేర్లను కూడా కేటాయించింది.
జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే. నగర్ స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండాకులు గుర్తు కోసం ఇరు వర్గాలు పోటీపడ్డాయి. ఇరువురు వాదనలు ఆలకించిన ఈసీ.. ఆ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేసింది. అదేసమయంలో ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న శశికళ, పన్నీర్ సెల్వం అభ్యర్థులకు కొత్త గుర్తులను కేటాయించింది.
శశికళ వర్గానికి 'టోపీ' గుర్తును కేటాయిస్తూ, ఆమె వర్గం పార్టీ పేరును ‘ఏఐఏడీఎంకే అమ్మ’గానూ, పన్నీర్ సెల్వం వర్గానికి 'విద్యుత్ స్తంభం' గుర్తును కేటాయిస్తూ, ఆయన వర్గం పార్టీ పేరును ‘ఏఐఏడీఎంకే పురట్చితలైవి అమ్మ’గానూ పిలవాలని పేర్కొంది. ఏప్రిల్ 12న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఈ గుర్తులపైనే పోటీ చేయాలని గురువారం ఇచ్చిన తీర్పులో తెలిపింది.