Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానాల్లో ఇలా కూడా ప్రయాణిస్తారా.. భారత్‌నే మించిపోయిన పాకిస్తాన్

విమానాలను ఎంత దరిద్రంగా నడపవచ్చో భారతీయ విమానయాన సంస్థలు రోజుకొక్క సినిమా చూపిస్తుంటే నా దాయాదికి నేను ఇందులో కూడా తక్కువ కాదని పాకిస్తాన్ నిరూపించుకుంది

Advertiesment
pakistan international airlines
హైదరాబాద్ , ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (07:33 IST)
విమానాలను ఎంత దరిద్రంగా నడపవచ్చో భారతీయ విమానయాన సంస్థలు రోజుకొక్క సినిమా చూపిస్తుంటే నా దాయాదికి నేను ఇందులో కూడా తక్కువ కాదని పాకిస్తాన్ నిరూపించుకుంది. మన విమానాల పైలట్లు విమానాన్ని గాల్లోకి లేపి సీట్లోనే నిద్రపోతారు.. ఎప్పుడు విమానం ప్రయాణానికి సిద్ధమవుతుందో చెప్పడానికి నాలుగైదు గంటల సమయం తీసుకుని అప్పుడు ప్రయాణాన్ని రద్దు చేశామని చల్లగా చెబుతారు. మనకంటే పాక్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే తిన్నట్లుంది. ప్రపంచ విమానయాన చరిత్రలోనే తొలిసారిగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానం కొంతమంది ప్రయాణీకులను బస్సుల్లో లాగా నిలబెట్టి తీసుకెళ్లింది. విషయం తెలిసి గగ్గోలు లేవడంతో అదరాబాదరా విచారణకు ఆదేశించింది. 
 
సాధారణంగా సిటీబస్సుల్లో కూర్చోడానికి ఖాళీ లేకపోతే నిలబడి వెళ్తాం. కొద్ది దూరం వెళ్లాల్సిన రైళ్లలోనూ అలాగే జరుగుతుంది. కానీ ఏకంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాల్సిన విమానాల్లో కూడా నిలబెట్టి ఎవరైనా తీసుకెళ్తారా పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సంస్థ మాత్రం ఇలాగే చేసింది. సౌదీ అరేబియాకు వెళ్లే విమానంలో ఏడుగురు ప్రయాణికులకు సీట్లు లేవని.. ఒక పక్కన నిలబెట్టి వాళ్లను తీసుకెళ్లారు. కరాచీ నుంచి మదీనా వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగిందని తెలిసింది.
 
అసలు ప్రయాణికులను నిలబెట్టి ఎలా తీసుకెళ్లారన్న విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అదికార ప్రతినిధి దన్యల్ గిలానీ చెప్పారు. మొత్తం సీట్లన్నీ నిండిపోయిన తర్వాత కూడా ఆ విమానంలోకి ఏడుగురిని ఎక్కించి తీసుకెళ్లిన మాట వాస్తవమేనన్నారు. ఈ విషయం పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రికలో రావడంతో వెలుగుచూసింది. చేత్తో రాసిన బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి వాళ్లను విమానం ఎక్కించారు. ఇలా తీసుకెళ్తే చాలా సమస్యలు వస్తాయని, అత్యవసరంగా కావల్సి వస్తే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు తగినంతగా ఉండవని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇలా నిలబెట్టి విమానంలో తీసుకెళ్లడం ఇదే మొట్టమొదటి సారి.  
 
తాను టేకాఫ్ తీసుకున్న తర్వాత చూస్తే కొంతమంది అదనంగా కనిపించారని, కానీ దాని గురించి తనకు ఎవ్వరూ చెప్పలేదని విమాన పైలట్ అన్నారు. విమానం తలుపు మూసేముందు ఇలా ఎవరైనా ఎక్కువగా ఉంటే చెప్పాలని, కానీ తాను టేకాఫ్ తీసుకున్న తర్వాత గమనించడంతో.. పోనీ వెనక్కి తీసుకెళ్లి కరాచీలో లాండ్ చేద్దామంటే అందుకు చాలా ఇంధనం వృథా అవుతుందని, అది తమ విమానయాన సంస్థ ప్రయోజనాలకు విరుద్ధం కాబట్టి అలాగే తీసుకెళ్లిపోయానని ఆ పైలట్ చెప్పినట్లు తెలిసింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన అమెరికాను ప్రేమించారు.. అమెరికా అయన్ని ప్రేమించిందా: సునయన