Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసుపత్రిలో అమ్మ.. ఎటీఎమ్ నుంచి డబ్బు తెస్తానని వెళ్లి మాయమైన పుత్రుడు.. ఆ ముదుసలికి ఎంత కష్టం..!

నువ్వు బాలీవుడ్‌లో నటిగా తారాపధాన్ని అనుభవించి ఉండవచ్చు.. వెండితెరపై వెలుగులు రువ్వి ఉండవచ్చు. కానీ వయసు మళ్లాక ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోతే, కన్న కొడుకు, కూతురు అమ్మ గురించి ఆలోచించాల్సిన సమయంలో ఆలోచించకపోతే.. ఒక పండుముదుసలి బతుకు అధోగతి పాలవుతుంద

Advertiesment
Pakeezah
హైదరాబాద్ , మంగళవారం, 30 మే 2017 (04:20 IST)
నువ్వు బాలీవుడ్‌లో నటిగా తారాపధాన్ని అనుభవించి ఉండవచ్చు.. వెండితెరపై వెలుగులు రువ్వి ఉండవచ్చు. కానీ వయసు మళ్లాక ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోతే, కన్న కొడుకు, కూతురు అమ్మ గురించి ఆలోచించాల్సిన సమయంలో ఆలోచించకపోతే.. ఒక పండుముదుసలి బతుకు అధోగతి పాలవుతుంది. పాకీజా వంటి పలు హిందీ సినిమాల్లో యాభై ఏళ్ల క్రితం నటించి అలరించిన మంచి నటి గీతా కపూర్ బతుకు ఇప్పుడు అక్షరాలా ఆసుపత్రి పాలయింది. ఆమె దుర్భర పరిస్థితి చూస్తే పగవాడికి కూడా ఇలాంటి బతుకు వద్దనిపించకమానదు.
 
ఐదు దశాబ్దాల క్రితం‘పాకీజా’ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి గీతా కపూర్‌ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను కొడుకు ఆస్పత్రిలో నిస్సహాయస్థితిలో వదిలేసి వెళ్లిపోయాడు. బాంబే మీడియా కథనం ప్రకారం గీతాకపూర్‌ కొడుకు రాజా ఆమెను గత నెల ముంబై గోరేగావ్‌లోని ఎస్‌వీఆర్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆస్పత్రిలో కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొస్తానంటూ చెప్పి వెళ్లిపోయిన అతను ఆ తర్వాత తిరిగి రాలేదు. 
 
అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. అసుపత్రిలో అనాధగా పడి ఉన్న ఆమె గతంలో పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిందని తెలియడంతో ఆమె గురించి కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. తనను వదిలించుకోవాలని తన కొడుకు చూస్తున్నాడని, అందుకే తనను ఆస్పత్రిలో వదిలేసి పోయాడని ఆమె మీడియాకు తెలిపింది. 
 
‘అతని చర్యలను తప్పుబట్టడంతో అతను నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు’ అని ఆమె తెలిపింది. కొడుకు రాజా ప్రస్తుతం తమ ఇంట్లో ఉండటం లేదని తెలుస్తోంది. 
 
గీతాకపూర్‌ను ఇంటికి తీసుకెళ్లాలని, ఆస్పత్రి ఫీజు లక్ష రూపాయలు చెల్లించాలని రాజాకు ఆస్పత్రి సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. గీతాకపూర్‌ కూతురు పూజ కూడా ఈ విషయంలో పట్టనట్టు దూరంగా ఉండటంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. గీతాకపూర్‌ కొడుకుపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
 
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మ తృప్తికై మనుషులాడుకునే వింత నాటకం.. అంటూ తాతామనవడు సినిమాలో ఎస్వీ రంగారావు పాడిన పాట గుర్తుంది కదూ.. కుటుంబాలు పట్టించుకోకపోతే, వ్యవస్థ ఆలంబనగా నిలబడకపోతే కనిపెంచిన తల్లిదండ్రుల పరిస్థితి మన దేశంలో ఇంతే అని ఆ ముదుసలి తన జీవితం సాక్షిగా నిరూపిస్తూనే ఉంటుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో డిగ్రీ చదివిన మహిళల్లో 65 శాతం మంది పని చేయడం లేదా.. అయినా వృద్ధి రేటులో మనమే ఫస్ట్ అట