అమ్మ జయలలిత సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... వెనక్కి తగ్గను.. తాడోపేడో తెల్చుకుంటా?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అమ్మ జయలలిత సాక్షిగా ప్రమాణం చేశారు. మన్నార్గుడి మాఫియా కనుసన్నల్లో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామితో తాడోపేడో తేల్చుకుంటానని ఆయన ప్రకటిం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అమ్మ జయలలిత సాక్షిగా ప్రమాణం చేశారు. మన్నార్గుడి మాఫియా కనుసన్నల్లో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామితో తాడోపేడో తేల్చుకుంటానని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రెండు వైరి వర్గాలుగా విడిపోయిన విషయం తెల్సిందే. అయితే, శశికళ అరెస్టు తర్వాత ఈ రెండు వైరివర్గాలు విలీనమయ్యేందుకు చర్చలు ప్రారంభించారు. కానీ, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రితోపాటు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవులను అప్పగించాలని పట్టుబట్టారు. దీనికి ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి అంగీకరించలేదు. దీంతో వైరివర్గాల విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది.
ఈ నేపథ్యంలో తిరుగుబాటునేత పన్నీర్ సెల్వంకొత్త ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. రాష్ట్ర పర్యటన ప్రారంభించిన ఆయన అసలు తన సత్తా ఏంటో చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తనకే బలముందని పన్నీర్ అంటున్నారు. ఆ అంశాన్ని నిరూపించేందుకు నెలరోజుల యాత్ర ప్రారంభించారు. కాంచీపురంలో యాత్ర ప్రారంభమైన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జనం పెద్దసంఖ్యలో హాజరై పన్నీర్ ప్రసంగానికి కేరింతలు కొట్టారు. దీంతో ఇప్పుడు పన్నీర్ టూర్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ప్రజల్లో జయలలిత పట్ల ఉన్న అభిమానం, అదే ప్రజల్లో శశికళ పట్ల ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని పన్నీర్ నిర్ణయించుకున్నారు. అందుకే ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రజాబలం ద్వారా రాజకీయ మార్పుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. జయలలిత పంచన ఎదిగిన నేతగా కాకుండా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నారు పన్నీర్ సెల్వం. గతంలో జయలలిత తనను పొగిడిన సందర్భాలను గుర్తుచేస్తూనే సొంత ఇమేజ్‌తో ఎదిగిన నేతగా చెప్పుకునేందుకు పన్నీర్ తాపత్రయపడుతున్నారు.