Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రం ప్రకటనపై భగ్గుమన్న విపక్షాలు

కేంద్రం ప్రకటనపై భగ్గుమన్న విపక్షాలు
, గురువారం, 22 జులై 2021 (07:51 IST)
కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో ఎవరూ చనిపోలేదన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్రం చెబుతున్నట్టు ఆక్సిజన్ కొరత లేకుంటే ఆసుపత్రులు కోర్టుకు ఎందుకు వెళ్లాయని ప్రశ్నించాయి.

దేశం ఎదుర్కొంటున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని ఆసుపత్రులు, మీడియా ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాయని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ అన్నారు.
 
ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఎందరో కొవిడ్ బాధితులు ఆక్సిజన్ కొరతతో మరణించారని అన్నారు. కానీ కేంద్రం మాత్రం ఒక్కరు కూడా చనిపోలేదని అబద్ధాలు చెబుతోందని దుయ్యబట్టారు. కొవిడ్ రెండో దశలో ఆక్సిజన్ నిర్వహణ విషయంలో చేతులెత్తేసిన కేంద్రం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి బూటకపు ప్రకటనలు చేస్తోందన్నారు.
 
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రాణవాయువు అందుబాటులో లేక అనేక రాష్ట్రాల్లో ఎంతోమంది చనిపోయారని అన్నారు. కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోందని, బాధిత బంధువులు ఈ విషయాన్ని ఇప్పుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వాస్తవానికి దూరంగా కేంద్రం పారిపోతోందోని అన్నారు. బహుశా ఇదంతా పెగాసస్ ప్రభావం కావొచ్చని రౌత్ ఎద్దేవా చేశారు.
 
ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ మండిపడింది. కొవిడ్ మరణాల డేటాను కేంద్రం తయారుచేయలేదని, ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన డేటానే కేంద్రం వెల్లడించినట్టు ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా బాధితులు చనిపోయినట్టు రాష్ట్రాలేవీ తమ నివేదికల్లో పేర్కొనలేదని, అదే విషయాన్ని కేంద్రం చెప్పిందని ఆయన వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు 21న ఎడ్‌సెట్‌