Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Advertiesment
India vs Pakistan

ఠాగూర్

, బుధవారం, 7 మే 2025 (11:08 IST)
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలకు భారత్ శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్థరాత్రి దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత సైన్యానికి చెందిన త్రివిధ దళాలు కలిసికట్టుగా పాల్గొన్నాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై మూడు రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఆపరేషన్ సింధూరం పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై కచ్చితమైన క్షిపణి దాడులు జరిపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అత్యధికులు పర్యాటకులు కాగా, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ శపథం చేశారు. 
 
దీనికి అనుగుణంగా, మంగళవారం అర్థరాత్రి (బుధవారం తెల్లవారుజామున) 1:44 గంటలకు 'ఆపరేషన్ సింధూర్' పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. "భారత్‌పై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేస్తున్న పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నామని" సైన్యం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది.
 
ఈ దాడులలో త్రివిధ దళాలకు చెందిన ఖచ్చితత్వంతో కూడిన దాడి ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లక్ష్యాన్ని ఛేదించి, విధ్వంసం సృష్టించే కామికేజ్ డ్రోన్లు (లోయిటరింగ్ అమ్యూనిషన్స్) కూడా ఈ దాడుల్లో వినియోగించినట్లు సమాచారం. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, అయితే "పాకిస్థాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు జరపలేదని" సైన్యం నొక్కి చెప్పింది. "లక్ష్యాల ఎంపికలోనూ, దాడుల నిర్వహణలోనూ భారత్ చాలా సంయమనం పాటించింది" అని సైన్యం పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్