Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

Advertiesment
one nation - one election

ఠాగూర్

, ఆదివారం, 15 డిశెంబరు 2024 (11:31 IST)
ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం - ఒకే ఎన్నిక నినాదానికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లును తయారు చేసింది. దీన్ని సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. తరచూ ఎన్నికలు జరుగుతూ ప్రతి రోజూ దేశంలో ఏదో మూల ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న బృహత్తక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తలకెత్తుకుంది. 
 
జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో 82ఏ పేరుతో కొత్త ఆర్టికల్‌ను చేరుస్తారు. ఆర్టికల్ 83(పార్లమెంటు ఉభయ సభల కాలవ్యవధి), ఆర్టికల్ 172 శాసనసభల కాల వ్యవధి), ఆర్టికల్ 327 (చట్ట సభలకు ఎన్నికల విషయంలో పార్లమెంటుకు నిబంధనలను రూపొందించే అధికారం)లను సవరిస్తారు. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందిన తర్వాత తదుపరి పార్లమెంటు తొలిసారి సమావేశమయ్యే తేదీని రాష్ట్రపతి ప్రకటిస్తారు. దాన్ని అపాయింటెడ్ డేట్ అంటారు. అంతకు ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. పార్లమెంటు కాలపరిమితి అపాయింటెడ్ డేట్ నుంచి ఐదేళ్లలో ముగిసిపోతుంది. అన్ని రాష్ట్రాల శాసనసభల కాలప రిమితి కూడా అదే పద్ధతిలో ముగిసిపోతుంది. లోక్‌సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 
 
లోక్‌సభకు కానీ, శాసనసభ కానీ కాలపరిమితి పూర్తి కాకుండానే రద్దయితే ఐదేళ్లలో మిగిలిన కాలానికి ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేస్తారు. 1951-52, 1957, 1962, 1967 సంవత్సరాల్లో జమిలి ఎన్నికలే జరిగాయని బిల్లులో గుర్తు చేశారు. 1968, 68 సంవత్సరాల్లో కొన్ని శాసనసభలను అర్థాంతరంగా రద్దు చేయడంతో ఆ క్రమం తప్పిందని ప్రస్తావించారు. రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సూచన మేరకు ఒకే దేశానికి ఒకే ఎన్నిక విధానాన్ని ఎంచుకున్నట్లు బిల్లు ఉద్దేశాల్లో పేర్కొన్నారు. కోవింద్ కమిటీ స్థానిక సంస్థలను కూడా చేర్చాలని సూచించినా ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!