Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే 'వన్ నేషన్ - వన్ ఎలక్షన్'

Modi

ఠాగూర్

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (09:04 IST)
ప్రస్తుతం దేశ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పేరుతో రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉంది. 
 
దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ ఎప్పటి నుంచో ఆలోచన చేస్తోంది. దీనిపై ఎన్డీఏ-2లోనే మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించిన కమిటీ నివేదికను కేంద్రానికి పంపింది. దీనిపై ఇటీవలే జరిగిన కేంద్ర కేబినెట్‌‌లో ఆ అంశానికి ఆమోదముద్ర వేసింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
 
జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించడమే తరువాయి. అయితే జమిలి ఎన్నికలకు సంబంధించి ఆమోదం పొందాలంటే రాజ్యంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం ఉంటుంది. 
 
245 సీట్లు ఉన్న రాజ్యసభలో ఎన్టీఏకి 112 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షానికి 85 సీట్లు ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించడానికి ప్రభుత్వానికి కనీసం 164 సీట్లు అలాగే లోక్‌సభలోని 545 సీట్లలో 292 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఉన్నారు. మూడింట రెండు వంతుల మెజార్టీ అంటే 364 సభ్యుల మద్దతు అవసరం. 
 
ఈ కారణంగా బిల్లు ఆమోదం పొందడం కష్టసాధ్యమే అవుతుంది. దీంతో విస్తృత సంప్రదింపులకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును సిఫార్సు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిదులతో జేపీసీ సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
 
అయితే జమిలి ఎన్నికలను బీఎస్పీ అధినేత్ర మాయావతి స్వాగతిస్తుండగా, ఇండియా కూటమి పార్టీలు మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. జమిలి బిల్లును ఆమోదించేందుకు బీజేపీకి అంత బలం లేదని, ఖచ్చితంగా బిల్లు వీగిపోతుందని కాంగ్రెస్ పేర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెడితే ఏమి జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యసభ సీటు స్థానంలో మంత్రి పదవి... ఎందుకిచ్చారో తెలుసా?