కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టయ్యేలా కనిపిస్తున్నారు. 2018 నాటి పరువు నష్టం దావా కేసులో ఆయన కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఆదేశం మేరకు ఆయన న్యాయస్థానంలో హాజరుకాకపోతే రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిజానికి ఈ కేసులో గత యేడాది జూన్ 26వ తేదీన కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు తోసిపుచ్చింది.
ఆ తర్వాతి కాలంలో జార్ఖండ్ కోర్టు ఆదేశాల మేరకు ఈ పరువు నష్టం దావా కేసులో 2020 ఫిబ్రవరిలో రాంచీలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ కేసు చైబాసాలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన మేజిస్ట్రేట్.. రాహుల్ గాంధీకి సమన్లు జారీచేశారు.
కోర్టు పలుమార్లు సమన్లు జారీచేసినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో తొలుత ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్‌పై స్టే విధించాలని కోరుతూ రాహుల్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను 2024 మార్చి 20వ తేదీన హైకోర్టు కొట్టివేసింది.
ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా చైబాసా కోర్టు తిరస్కరించింది. తాజాగా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే, తదుపరి విచారణను జూన్ 26వ తేదీకి వాయిదా వేసింది.