కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రికాకుండా ఎవరూ అడ్డుకోలేరని అయితే, అందుకు కొంత సమయం పడుతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని డీకే శివకుమార్ ఖండించారు.
ఇదే అంశంపై వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ కర్నాటక ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. డీకేకు సీఎం పదవి కాలపరిమితో కూడుకున్నదని, దీనిపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారని, కాకపోతే అందుకు కొంత సమయం పడుతుందని వీరప్ప మొయిలీ పేర్కొన్నారు.
డీకే తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ అందుకోవడం వెనుక తన పాత్ర ఉందని గుర్తుచేశారు. ఇపుడాయన రాష్ట్ర రాజకీయాల్లో విజయవంతమైన నేతగా ఎదిగారని, త్వరలోనే ఆయన సీఎం కావాలని కోరుకుందామని పేర్కొన్నారు. ఎన్ని రకాలైన ఊహాగానాలు వినిపించినా ఆయన మాత్ర సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కర్నాటక సహా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డీకే ఎంతగానో కృషి చేశారని చెప్పారు. అందువల్ల సీఎం పదవి విషయంలో ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.