Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కంటే శశికళ గొప్పదా... పళనిస్వామి డైలెమ్మా

శశికళ నమ్మిన బంటే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రత్యర్థి పన్నీర్ సెల్వంతో పొత్తుకు కూడా సిద్ధ పడిపోయేంతగా తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం కోసం సాగుతున్న తాజా వ్యూహంలో తొలి వికెట్ శశికళ మేనల్లుడు దినకరన్.

ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కంటే శశికళ గొప్పదా... పళనిస్వామి డైలెమ్మా
హైదరాబాద్ , సోమవారం, 17 ఏప్రియల్ 2017 (07:39 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనంతరం తమిళనాడు రాజకీయాలను శాసించాలనుకున్న జయ నెచ్చెలి శశికళ ఎన్ని ప్రయత్నాలు చేశారు? తన వర్గం నేతలను కాపాడుకోవడానికి ఎన్ని క్యాంపులు నడిపారు? పన్నీరు సెల్వం తిరుగుబాటును అణిచివేయడానికి ఎన్ని వ్యూహాలు పన్నారు. తన నమ్మిన బంటు పళనిస్వామికి తన పరోక్షంలో పట్టం కట్టడానికి ఎంత శ్రమించారు. కన్నీళ్లు పెట్టారు. ఏడ్చారు. అమ్మ సమాధి ముందు ముమ్మారు బాది ఎంత గట్టి శపథం చేశారు? ఇవేవీ ఆమెకు అక్కరలో పనికిరావడం లేదు. శశికళ నమ్మిన బంటే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రత్యర్థి పన్నీర్ సెల్వంతో పొత్తుకు కూడా సిద్ధ పడిపోయేంతగా తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం కోసం సాగుతున్న తాజా వ్యూహంలో తొలి వికెట్ శశికళ మేనల్లుడు దినకరన్.
 
ఈ విషయంపై పన్నీరు, పళని శిబిరాలకు చెందిన సీనియర్ల మధ్య ఆదివారం కూడా చర్చలు సాగినట్లు సమాచారం. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం పళనిస్వామి అనుకూలురైన ఎమ్మెల్యేలు 60 మంది వరకు ఉండగా, దినకరన్‌కు మద్దతు నిస్తున్న ఎమ్మల్యేలు 40 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శశికళ వర్గం విశ్వాస పాత్రులైన ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు ఐటీ దాడుల భయాన్ని అస్త్రంగా ప్రయోగించేందుకు తాము సిద్ధం అని, అదే సమయంలో దినకరన్‌ని ఎలా తప్పించాలో అన్న విషయం మీద దృష్టి పెట్టాలని పళని స్వామి మద్దతు మంత్రులకు పన్నీరు శిబిరం సూచించింది. 
 
దినకరన్‌ని అన్నాడిఎంకే నుంచి తప్పించడం,  ఐటీ ఉచ్చులో పడ్డ మంత్రి విజయ భాస్కర్‌ను పదవి నుంచి సాగనంపడం అనే రెండు పిట్టలపై దాడికి ఏకకాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆ ఇద్దర్ని బయటకు పంపించి, ప్రజల వద్ద మార్కులు కొట్టేయడానికి తగ్గ వ్యూహంతో పళని స్వామి ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.  
 
ఐటీ దాడుల నేపథ్యంలో అన్నాడీఎంకే(అమ్మ) శిబిరంలో సాగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఐటీ ఉచ్చులో పడ్డ మంత్రి విజయభాస్కర్‌ను తొలగించే వ్యవహారంలో అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, సీఎం ఎడపాడి పళని స్వామిల మధ్య బయలుదేరిన విభేదాలు కొత్త అడుగులకు దారి తీస్తున్నాయి. దినకరన్‌ని పక్కన పెట్టి, అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు తగ్గ ఎత్తుగడల్లో మాజీ సీఎం, ప్రస్తుత సీఎం ఏకం అయ్యేందుకు సాగుతున్న ప్రయత్నాలు ఫలితాల్ని ఇస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
 
ఇక, తనను తప్పించి, ఆ ఇద్దరు ఏకం అయ్యేందుకు సాగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ కన్నుమూత