అక్రమ సంతానం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పుఇచ్చింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్రమ సంతానం ఉండదని పేర్కొన్నది.
తమ పుట్టుకలో పిల్లల పాత్ర ఏమీ ఉండదని కోర్టు పేర్కొన్నది. బెంగళూరు ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ బెస్కాంలో గ్రెడ్ 2 లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మరణించడంతో ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞప్తి చేయగా, బెస్కాం తిరస్కరించింది.
మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టవిదుద్ధమని, అలాంటి రెండో భార్య సంతానానికి ఉద్యోగం ఇవ్వడం కుదరదని బెస్కాం తెలిపింది.
దీంతో రెండో భార్య కూమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. మొదట సింగిల్ బెంచ్ ఈ కేసుకు కొట్టివేసింది. కాగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సంజీవ్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టరని, తమ పుట్టుకలో వారి పాత్ర ఏమీ లేదని, అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్రమ సంతానం ఉండదని ధర్మాసనం పేర్కొన్నది.
రెండో భార్య కుమారుడు సంతోషకు ఉద్యోగం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని బెస్కాంను ఆదేశించింది. అదేవిధంగా చట్టబద్ద వివాహాల పరిధికి వెలుపల జన్మించే చిన్నారులకు ఎలా రక్షణ కల్పించాలన్న దాని గురించి పార్లమెంటు ఆలోచించాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.