అనేక మంది చిన్నారుల మృతికారణంగా ఉన్న కోల్డ్‌రిఫ్ పేరుతో దగ్గుమందును తయారుచేసిన కంపెనీపై తమిళనాడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోల్డ్‌రిఫ్ మందును తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ తయారు చేసింది. ఈ దగ్గు మందు సేవించిన అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దగ్గుమందును తయారు చేసిన శ్రేసన్ ఫార్మాపై తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు స్పందిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిందించుకునే సమయం కాదని.. జవాబుదారీతనం అవసరమని పేర్కొన్నాయి. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
'ఇది కేంద్రం నుంచి రాష్ట్రాన్ని నిందించే సమయం కాదు. కానీ టీఎన్-ఎఫ్డీఏ చర్యలు తీసుకోవడం లేదు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసినప్పటికీ ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు..? డీసీజీఐ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయలేదు..?' అని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ.. మరింత హాని జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందన్నారు.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ దగ్గు మందు వివాదంపై స్పందించింది. ఈ మందును ఇతర దేశాలకు ఏమైనా ఎగుమతి చేశారా అని భారత్‌ను ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత సమాధానం చెబుతామని ఐరాసకు భారత్ సమాధానం చెప్పింది.