బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర అధికార జేడీయు తేరుకోలని షాకిచ్చింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం ఏడో రౌండ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో జేడీయూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడంటూ బీజేపీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలను జేడీయూ ఖండిస్తూనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది.
పాట్నాలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నితీష్ కుమార్‌ను ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ, ఆమె (ప్రగ్యా సింగ్) వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని, అలాంటి వ్యాఖ్యలకు తమ మద్దతు ఉండదన్నారు. అయితే అది పూర్తిగా బీజేపీ అంతర్గత వ్యవహారమని, సాధ్వీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇకపోతే, కాశ్మీర్‌లో 370వ అధికరణను రద్దు చేస్తామంటూ ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా ప్రస్తావించడంపై అడిగిన ఓ ప్రశ్నకు సైతం నితీష్ భిన్నంగా స్పందించారు. 370 అధికరణ తొలగింపును తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.