Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇచ్చేవాడికి సిగ్గు లేదు.. తీసుకునేవాడికీ అంతకంటే లేదు

కాటికి కాళ్లు చాచుకునే స్థితిలో ఉండి ప్రభుత్వ వృద్ధాప్య పించను పథకం ప్రకారం ఫించన్ రాక నానా అగచాట్లు పడుతున్న నిర్భాగ్యులు వేలాదిమంది ఈ దేశంలో ఇబ్బంది పడుతున్నారు. కానీ శ్రీమాన్ దాణా కింగ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి మాత్రం నెలకు పదివేల రూపాయల ఫించన్‌ను బి

ఇచ్చేవాడికి సిగ్గు లేదు.. తీసుకునేవాడికీ అంతకంటే లేదు
హైదరాబాద్ , గురువారం, 12 జనవరి 2017 (03:14 IST)
కాటికి కాళ్లు చాచుకునే స్థితిలో ఉండి ప్రభుత్వ వృద్ధాప్య పించను పథకం ప్రకారం ఫించన్ రాక నానా అగచాట్లు పడుతున్న నిర్భాగ్యులు వేలాదిమంది ఈ దేశంలో ఇబ్బంది పడుతున్నారు. కానీ శ్రీమాన్ దాణా కింగ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి మాత్రం నెలకు పదివేల రూపాయల ఫించన్‌ను బిహార్‌లో నితీష్ ప్రభుత్వం పిలిచి బొట్టు పెట్టి పిలిచి మరీ ఇస్తోంది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఆయనగారికి 2009 నుంచి ఈరోజు వరకు బకాయిలు కూడా అందనున్నాయని తెలిసిన జనం బిత్తరపోతున్నారు.
 
అలాగని లాలూ డబ్బులేనివాడు, ఆసరా లేనివాడు, పేదరికంలో మునుగుతున్న వాడు కాడు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి, దశాబ్దాలుగా బీహార్ రాజకీయా్ల్లో కుటుంబంతో సహా పాతుకుపోయిన పెద్దమనిషి. ఈయనకు పించనేంటి అని సామాన్యులకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ ఇది నిజం. ఎమర్జెన్సీ బాధితుల చట్రం కింద లాలూగారికి ఈ మాత్రం సహాయం ఫించన్ రూపంలో రానుంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అంటే 1974 మార్చ్ 18 నుంచి 1977 మార్చ్ 21 మధ్య కాలంలో ఆరు నెలలు అంతకంటే అధికంగా జైలు జీవితం గడిపిన వారు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సేనాని సమ్మాన్ పెన్షన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు అర్హులే అయితే నెలకు పదివేల రూపాయలు ఇస్తున్నారు. 
 
నితీశ్ ప్రభుత్వం కూడా ఈ పథకం కిందే తన ఆప్తుడు లాలూప్రసాద్ యాదవ్‌కి పదివేల ఫించన్ కట్టబెడుతున్నారు. లాలూ ఏమిటి, జేపీ ఫింఛన్ పథకం కింద అర్హుడు కావడమేమిటీ అంటే ఆ అర్హత తనకు ఉంది మరి. 1970ల్లో విద్యార్ధి నాయకుడిగా ఉన్న లాలూ నాడు జేపీ అనుచరుడిగా ఉంటూ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆరు నెలలకంటే అధికంగా జైలు జీవితం గడిపారు. కాబట్టి ఆటోమెటిక్‌గా ఈ పథకం కింది ఫించనుకు లాలూ అర్హత సంపాదించేసారు. నీతీశ్ సర్కారు 2009 నుచి ఈ పథకం కింద ఎమర్జెన్సీ బాధితులకు ఫించన్ ఇస్తోంది. 
 
మన లాలూగారికి ఈ విషయం తెలుసో, తెలీదో, లేక ఆలస్యనంగా నయినా సరే అందివచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకావాలని అనిపించిందో కాని నాకూ ఫించన్ కావాలని పిటిషన్ వేసేశారు. ఇంకేం మరి.. నితీశ్ సర్కారు ఒకే చేసింది. పైగా 2009 నుంచి బకాయిలను కూడా కలిపి మరీ లాలూ చేతిలో పెడుతోంది. కానీ పశువుల దాణా కుంభకోణంలో జైలుశిక్ష అనుభవించిన నాయకుడిగా పేరున్న లాలూ జేపీ సమ్మాన్ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవడంపై షాక్‌కు గురౌతున్న ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు సిద్ధమయ్యాయి. 
 
సాంకేతికంగా చూస్తే లాలూ ఎమర్జెనీ బాధితుల ఫించన్ పథకానికి అర్హుడే. సందేహమే లాదు. కానీ ఇంత కోటీశ్వరుడు, ఇంత పవర్‌పుల్ వ్యక్తి కూడా సాంకేతిక కారణాలు చూపి పదివేల రూపాయల ఫించనుకు సిద్దపడటం సబబేనా అంటూ జనం మండిపడుతున్నారు. ఇచ్చేవాడికన్నా సిగ్గుండాలి. తీసుకునేవాడికన్నా సిగ్గుండాలి అని సామెత ఊరకే చెప్పలేదు మరి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయ పార్టీలకు నూరుశాతం పన్ను మినహాయింపు సబబే అన్న సుప్రీంకోర్టు