నిర్భయ దోషులకు ఉరి.. మరోమారు డెత్ వారెంట్ జారీ

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (16:46 IST)
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలకు వచ్చే నెల మూడో తేదీన ఉరిశిక్షలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు డెత్ వారెంట్‌ను జారీచేసింది. మార్చి 3వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు నిర్భ‌య నిందితుల‌ను ఉరి తీయాల‌ని ఆ వారెంట్‌లో కోర్టు ఆదేశించింది. ఈ న‌లుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీ చేయ‌డం ఇది మూడ‌వ‌సారి. 
 
నిందితుల క్ష‌మాభిక్ష పిటిష‌న్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కార‌ణంగా.. గ‌త రెండు వారెంట్లు ర‌ద్దు అయ్యాయి. ఈ సారైనా నిందితుల‌కు ఉరిశిక్ష ప‌డుతుంద‌ని నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆశాభావం వ్య‌క్తంచేసింది. పటియాలా హౌజ్ కోర్టులోని అడిష‌న‌ల్ సెష‌న్ జ‌డ్జి ధ‌ర్మేంద‌ర్ రాణా.. తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. 
 
కాగా, న్యాయ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఈ నలుగురు ముద్దాయిలు తమకు విధించిన ఉరిశిక్షలు అమలుకాకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా నలుగురు ముద్దాయిలు ఇదే తరహాలో కోర్టును ఆశ్రయిస్తూ, ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తెలుగు భాష అమృతతుల్యం : వెంకయ్య నాయుడు