Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

Advertiesment
new parliament building
, ఆదివారం, 28 మే 2023 (11:05 IST)
సర్వాంగ సుందరంగా, అత్యాధునిక సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
 
అక్కడి నుంచి నేరుగా నూతన భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడే చేసిన హోమంలో పాల్గొన్నారు. దీంతో పార్లమెంటు నూతన భవంతి ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత వేదపండితులు శాలువా కప్పి ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు.
 
అదేసమయంలో ఆ సమీపంలో ఉన్న ఉత్సవ రాజదండానికి (సెంగాల్) తమిళనాడు నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం నుంచి నేరుగా సెంగోల్‌ దగ్గరకు చేరుకున్న ప్రధాని మఠాధిపతులకు నమస్కరించారు. అనంతరం సెంగోల్‌కు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత మఠాధిపతులు సెంగోల్‌ను ప్రధాని మోడీ చేతికి అందజేశారు. 
 
ఆ తర్వాత మఠాధిపతులు వెంటరాగా నాదస్వరం, భజంత్రీల మధ్య ప్రధాని దాన్ని లోక్‌సభలోకి తీసుకెళ్లారు. అక్కడ స్పీకర్‌ ఓం బిర్లా సమక్షంలో దాన్ని స్పీకర్‌ ఆసనం పక్కన ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
లోక్‌సభ నుంచి తిరిగి పూజాస్థలికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఓం బిర్లా సమక్షంలో ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న పలువురు కార్మికులను శాలువాతో సత్కరించారు. జ్ఞాపికలను బహూకరించారు. తర్వాత సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, అశ్వనీ వైష్ణవ్‌, జైశంకర్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరు గంటలు ఇంట్లో ఉండి రూ.10 లక్షలతో ఉడాయించిన వైనం