తనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) పదవి కంటే పంజాబ్ రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అన్నారు. పంజాబ్ భవిష్యత్తుపై తాను ఎప్పటికీ రాజీ పడలేనని ఆయన స్పష్టం చేశారు.
పీసీసీ పదవికి రాజీనామాపై ఆయన బుధవారం స్పందిస్తూ ప్రజలకు మంచి చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఇందుకోసం ఎంతటి ఉన్నత పదవినైనా వదులుకుంటానని చెప్పారు. పైగా, తనకు ఎవరితోనూ వ్యక్తిగతంగా వైరం లేదన్నారు. తాను ప్రజల జీవితాలను మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తన సిద్ధాంతాలపై రాజీపడబోనని సిద్ధూ ప్రకటించారు.
కాగా, పంజాబ్ రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. త్వరలోనే సిద్ధూ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ లేక ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై బీజేపీ నేతలు సైతం సానుకూలంగా స్పందించారు.
ఇదిలావుంటే, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో చోటుచేసుకుంటోన్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మరోపక్క, పంజాబ్ కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు త్వరలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు.