అతనో జాతీయ అథ్లెట్. మంచి ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా. పైగా బీఎస్ఎఫ్ జవాను. పేరు జస్బీర్ సింగ్ అలియాస్ సిరా. వయస్సు 34 యేళ్లు. ఇతని ప్రవృత్తి మాత్రం దొంగతనం. చోరకళలోనూ ఆరితేరిన అతను తన మార్కు చూపించాడు. ఎందుకో తెలుసా? తన ప్రియురాలికి విలువైన బహుమతులు కొనిచ్చేందుకు. ఇందుకోసం అతను ఎంచుకున్న మార్గం... విమానాశ్రయాల్లో... అదీ వీఐపీల బ్యాగులను దొంగిలించడం. బాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా దొంగిలించిన లగేజీతో దర్జాగా విమానంలో ఎక్కి పారిపోయేవాడు.
ఇంతకీ ఇతని గుట్టు ఎలా బయటపడిందన్న దానిపై ఆరా తీస్తే... ఓ రోజు ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నాయకుడి బ్యాగు కొట్టేసి దొరికిపోయాడు. ఎన్నోనెలలుగా హై ప్రొఫైల్ ప్రజల లగేజీ దొంగిలిస్తున్న జస్బీర్.. అలవాటుగా గత నెల 11న ఓ బ్యాగు కొట్టేశాడు. కానీ, ఈసారి తన చోరకళ సీసీ టీవీలో రికార్డవుతున్నట్టు గుర్తించలేకపోయాడు. తొలుత టి-3 టెర్మినల్ వైపు ఒకే బ్యాగుతో వచ్చిన శిరా.. కన్వేయర్ బెల్టు వద్దకు రాగానే ఆగిపోయాడు.
అక్కడ అతనికి ఒక బ్యాగు కనిపించింది. పక్కన యజమాని లేడు. ఇంకేం.. ఆ బ్యాగును పట్టేశాడు. ఆ లగేజీతో అహ్మదాబాద్ విమానం ఎక్కాడు. ఆ బ్యాగు బీజేపీ నాయకుడు హనుమంత్ సింగ్‌ది. ఆయన ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా జస్బీర్‌ను అమృత్‌సర్‌లోని అతని నివాసంలో అరెస్ట్ చేశారు. విచారణలో తన గాళ్‌ఫ్రెండ్‌కు గిఫ్టులు కొనిచ్చేందుకు వీఐపీల బ్యాగులను కొట్టేశానని తెలిపాడు. జస్బీర్ ఇప్పటి వరకూ 12 దొంగతనాలు చేసినట్టు అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.