ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా, ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు చేపట్టనున్నారు. అయితే, దేశం యావత్తూ బెంగాల్ ఎన్నికలపైనే దృష్టికేంద్రీకరించింది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌పైనే వుంది.
దీనికి కారణం లేకపోలేదు. నిన్నమొన్నటి వరకూ కుడిభుజంగా మెలిగినవాడే.. ఇప్పుడు మమత బెనర్జీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. నందిగ్రామ్‌లో మమతా వర్సెస్ సుబేందు అధికారి పోటీ ఎంతో ఆసక్తికరంగా మారింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయానికొస్తే నందిగ్రామ్‌కు ఎంతో ఆసక్తికర చరిత్ర ఉంది. దశాబ్దాల తరబడి కొనసాగిన వామపక్ష పరిపాలనకు చరమగీతం పాడుతూ దీదీని అధికారంలో కూర్చోబెట్టింది నందిగ్రామ్ నియోజకవర్గం. అలాంటి స్థానం 14 ఏళ్ల అనంతరం ఇప్పుడు మరోసారి నందిగ్రామ్ చర్చనీయాంశంగా నిలిచింది.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రెండో దశ పోలింగ్‌లో నందిగ్రామ్ కీలకంగా మారింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గతంలో కుడి భుజంగా నిలిచిన సుబేందు ఆమెతో పోటీ పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున నందిగ్రామ్‌లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.
పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ పేరు వినగానే ముందుగా హింస, రక్తపాతం గుర్తొస్తాయి. ఈ ప్రాంతంలో దశాబ్దం క్రితం జరిగిన అల్లర్లే ఇందుకు కారణంగా కనిపిస్తాయి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయి ఆ ప్రాంతానికున్న ప్రాముఖ్యత కాస్త తగ్గింది. తిరిగి ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో నందిగ్రామ్ పేరు మారుమోగిపోతోంది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆమెకు అత్యంత సన్నిహితుడిగా మెలిగి, ఆమధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి పోటీపడటమే ఇందుకు ప్రధాన కారణం.