Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగాల్‌లో ఇపుడే ఆట మొదలైంది... చూద్దాం... : మమతా బెనర్జీ

బెంగాల్‌లో ఇపుడే ఆట మొదలైంది... చూద్దాం... : మమతా బెనర్జీ
, మంగళవారం, 16 మార్చి 2021 (07:05 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇపుడే ఆటు మొదలైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇపుడే ఆట మొదలైంది. చూద్ధాం.. మనమే గెలుస్తాం అంటూ పురులియాలో జరిగిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన మమతా బెనర్జీ కాలికి దెబ్బతగిలింది. దీంతో ఆమె విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉండటంతో ఆమె చక్రాల కుర్చీలోనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అసమర్థుడని, ఆయన దేశాన్ని పరిపాలించలేడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన దేశాన్ని నిరంకుశంగా పరిపాలిస్తున్నాడని మండిపడ్డారు. 
 
'ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారి నోరు మూయిస్తారు. రాజకీయ పార్టీల నోళ్లు మూయిస్తారు. కానీ, నేను నా పోరాటాన్ని కొనసాగిస్తా' అని వ్యాఖ్యానించారు. ప్రసంగం మధ్యమధ్యలో ఆమె 'బీజేపీ హఠావో.. దేశ్‌ బచావో' అంటూ నినాదాలిచ్చారు. 
 
బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీలు అన్నదమ్ముల్లాంటివని ఆమె అభివర్ణించారు. ఎన్నికల్లో లబ్ధికోసం కాషాయ పార్టీ అల్లర్లకు పాల్పడే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. 'ఇప్పుడే ఆట మొదలైంది. చూద్దాం.. మనమే గెలుస్తాం. మనకు బీజేపీ వద్దు, కాంగ్రెస్‌ వద్దు, సీపీఎం వద్దు. బీజేపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టండి' అని బెంగాల్ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
 
పైగా, 'నేను ఎలాంటి దాడులకు భయపడేదాన్ని కాదు. సామాన్య ప్రజలు అనుభవిస్తున్న నొప్పి ముందు నేను నా నొప్పిని లెక్క చేయను. నేను విరిగిన కాలితోనే పోరాటం కొనసాగిస్తున్నాను' అని ప్రకటించారు. 'కొన్నాళ్లు వేచి చూడండి. నా కాళ్లు బాగవుతాయి. అప్పుడు మీరు బెంగాల్‌ గడ్డపై స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతారో చూస్తాను' అంటూ బీజేపీ నాయకులకు ఆమె బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీ సమావేశాలకు.. జీన్స్, టీషర్ట్ ధరించి వస్తారా? ఫైర్ అయిన స్పీకర్