ప్రజలు ఏం తినాలో తినకూడదో నిర్ణయించే తీరు ఇదేనా: మటన్‌ని మాయం చేస్తే జనం తినడం మానేస్తారా?
ఒక పెద్ద రాష్ట్రం ఇప్పుడు మాంసం లేక.. ఉన్నా దొరక్క అల్లాడుతోంది. అక్రమ కబేళాలు ఉండకూడదన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు సక్రమ కబేళాలను కూడా మూసివేసేంత భయ వాతావరణాన్ని సృష్టించడంలో నూటికి నూరుపాళ్లూ విజయవంతంమైంది. దీనిఫలితం మాంసాహారం అలవాటైన 8
ఒక పెద్ద రాష్ట్రం ఇప్పుడు మాంసం లేక.. ఉన్నా దొరక్క అల్లాడుతోంది. అక్రమ కబేళాలు ఉండకూడదన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు సక్రమ కబేళాలను కూడా మూసివేసేంత భయ వాతావరణాన్ని సృష్టించడంలో నూటికి నూరుపాళ్లూ విజయవంతంమైంది. దీనిఫలితం మాంసాహారం అలవాటైన 80 శాతం జనాలకు మాంసం దొరక్కుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కబేళాల నిర్వాహకులు సమ్మె చేయటంతో ఎలాంటి మాంసం కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఫలితం.. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అక్షరాలా కూరగాయల భోజనం చే్స్తోంది.
అసలు విషయం ఏమిటంటే మాంసాహారుల తిండి పద్ధతిని ఇలా ఎన్నాళ్లు అడ్డుకుంటారున్నదే. ఈ దేశ ప్రజల అదృష్టమో లేక దురదృష్టమో కానీ.. యోగులు అధికారంలోకి వచ్చినంత మాత్రాన జనం తిండి పద్ధతులను ఈ విధంగా కంట్రోల్ చేస్తారా, చేయవచ్చా.. జంతువుగా ఆవిర్భవించినప్పటినుంచి మనిషి అలవాటు చేసుకున్న ఆ సహస్రాబ్దాల మాంసాహార అలవాటును కబేళాలు మూసివేసి ఎన్నాళ్లు అడ్డుకుంటారు అన్నదే ఇప్పుడు పజిల్‌గా మారింది.
కూరగాయలతోనే ఆరోగ్యం, తెలివి, బుద్ధి కుశలత వస్తాయని నిజంగా నమ్ముతున్న వారు మన దేశంలో చాలా మందే ఉండవచ్చు. కానీ వానరుడు నరుడుగా మారే క్రమంలో మనిషి మెదడు ఎదగడానికి మాంస భక్షణ ఎంతగానో తోడ్పడిందని కొన్ని దశాబ్దాలుగా మానవ పరిణామ శాస్త్రజ్ఞులు, వైద్య పరిశోధకులు కూడా ప్రయోగ సహితంగా నిరూపిస్తూ వస్తున్నారు. ఈ నిరూపణలపై చర్చను పక్కన పెట్టి చూసినా మాంసాహారం కంటే శాఖాహారమే గొప్పదని ఇంతవరకు ఏ ప్రయోగశాలలోనూ తేలలేదు. అలాంటప్పుడు విశ్వాసాలు, నమ్మకాలు ఆధారంగా ఒక రకం ఆహారం మంచిది, మరోరకం ఆహారం చెడ్డది అనే చర్చ ఈ దేశ ప్రజల సాంస్కతిక పరమైన అలవాట్లలోని వైవిధ్యాన్నే తోసిపుచ్చుతున్నట్లు కాదా?
తాజా వార్త ఏమంటే దేశంలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో ఒకటైన ఆలీఘడ్ యూనివర్శిటీలో విద్యార్ధుల భోజన మెనూ నుంచి మాంసం మాయమైపోయిందని అక్కడి విద్యార్ధులు గగ్గోలు పెడుతున్నారు. వారానికి రెండు సార్లు మాంసాహారం పెట్టేవారని, కానీ వారం రోజులుగా కూరగాయల భోజనం పెడుతున్నారని వర్శిటీ విద్యార్థులు నేరుగా వైస్ చాన్సలర్‌కే ఉత్తరం రాశారు.
అయితే ధరలు పెరగడం వల్లే తాత్కాలికంగా మాంసాహరం నిలిపివేసినట్లు వర్శిటీ ప్రజాసంబంధాల అధికారి వివరణ ఇచ్చారనుకోండి. కానీ యూపీలో కొన్ని వేల కబేళాలను మూసివేయడం, మాంస దుకాణాదారులు మూకుమ్మడిగా మాంస వ్యాపారం నిలిపివేయడం.. జనం ఆహారంలో భాగమైన మాంసం వారంరోజులుగా అందుబాటులో లేకుండా పోవడం కొత్త ప్రభుత్వానికి మేలు కూర్చే పనేనా... జనాభాలో అతికొద్ది మంది పాటించే శాకాహారాన్ని ఇలా జాత మొత్తం మీద రుద్ది సన్యాసి పాలన అంటే ఇదే అని చూపించడం ఆ సన్యాసత్వానికైనా వన్నె తెచ్చేదేనా?
దీనిపై అభిప్రాయభేదాలు ఎలా ఉన్నా.. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పాలనా పరంగా తొలి ఓటమిని ఈ మాంస నిషేధం ద్వారా పొందక తప్పదని జనాభిప్రాయం. ప్రజల సాంస్కృతిక అలవాట్లను, ఆహార అభిరుచులను ప్రపంచంలో ఏదేశంలోనూ ఏ ప్రభుత్వం కూడా మార్చలేకపోయిందన్నది గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. పైగా ప్రజలు మౌలిక సమస్యలు మాంసాహారంపైనా, శాకాహారంపైనా ఆదారపడి లేవని పాలకులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.