Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంగీతానికి రాళ్ళను సైతం కరిగించే శక్తి ఉంది: ఉపరాష్ట్రపతి

సంగీతానికి రాళ్ళను సైతం కరిగించే శక్తి ఉంది: ఉపరాష్ట్రపతి
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:23 IST)
భారతీయ సంస్కృతిలో భాగమైన సంస్కారాన్ని పిల్లలకు తల్లిదండ్రులు అలవాటు చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. పిల్లల్లో సంస్కార బీజాలను నాటేందుకు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్రయత్నించారని, సంస్కారాన్ని నేర్పని విద్య పండితుల్ని తయారు చేస్తుందేమో గానీ బాధ్యతా యుతమైన పౌరులను తయారు చేయలేదని, అందుకే పిల్లలకు మన పురాణాలను, చరిత్రలోని మహనీయులను, మన పాటలను, పద్యాలను నేర్పించి సంస్కారాన్ని పరిచయం చేయాలని ఆయన తెలిపారు.
 
ఎస్పీ బాలు ప్రథమ వర్థంతి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాలు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, 110 తెలుగు అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించిన “విశ్వగాన గంధర్వ – 2021” అంతర్జాతీయ సంగీత సమ్మేళనం కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. తెలుగు పాటకు, తెలుగు వారికి వన్నె తీసుకొచ్చిన బాలు గారి స్మృతిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కనకమేడల ప్రొడక్షన్స్ సహా ఇతర నిర్వహకులను ఆయన అభినందించారు. 

బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఎంతో మంది జీవితాల్లో ఆయన గానం ఓ భాగంగా మారిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా బాలూతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, జీవితంలో కష్టపడి పైకి వచ్చి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే  బాలు స్వభావం తనకు ఎంతో ఆకట్టుకునేదని, భాష-సంస్కృతుల పట్ల అభిమానం తమను మరింత దగ్గర చేసిందని తెలిపారు.

కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు గారి ప్రతిభ అపురూపమైనదన్న ఉపరాష్ట్రపతి, గాయకుడిగానే గాక గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా తనలో బహుముఖప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచారు. 

బాలు నిర్దేశకత్వంలో సాగిన పాడుతా తీయగా కార్యక్రమం గురించి ప్రస్తావించిన ఆయన, ఈ కార్యక్రమం ఎన్నో నూతన గళాలను పరిచయం చేసి,ఎందరో ఔత్సాహిక గాయకుల ప్రతిభను వెలికితీయడమే గాక.. యువత ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు తోడ్పడిందని తెలిపారు. పిల్లలకు సంగీతంలో మెలకువలను నేర్పిస్తూ, వారి ప్రతిభకు సానపెడుతూ, వేలాది స్వరాలను వెలుగులోకి తెచ్చిన శ్రీ బాలు గారి కృషిని తెలుగు జాతి, మరీ ముఖ్యంగా సంగీత ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.

బాలసుబ్రహ్మణ్యం, వారి తండ్రి సాంబమూర్తి .. భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఎంతగానో తపించే వారన్న ఉపరాష్ట్రపతి, సాంబమూర్తి గారు భిక్షాటన పూర్వక త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తే, బాలూ గారు నెల్లూరులోని తమ ఇంటిని వేదపాఠశాలకు సమర్పించారని తెలిపారు.

తనకు గాయకుడిగా జన్మనిచ్చిన ఎస్పీ కోదండపాణి పేరిట రికార్డింగ్ థియేటర్ నెలకొల్పి, హైదరాబాద్ రవీంద్రభారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి, కేజే ఏసుదాసుకు పాదాభిషేక చేసి పెద్దల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను చాటిన సంస్కారం బాలూకు సొంతమని, వారి వినమ్రతను ఈతరం గాయనీగాయకులు, కళాకారులు, యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
 
బాలు తెలుగు ఉచ్చారణ ఎంతో ఆనందాన్ని ఇచ్చేదన్న ఉపరాష్ట్రపతి, మన భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడమే వారికి అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఐదున్నర దశాబ్ధాల పాటు తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన బాలూ కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం అత్యంత విచారకరమన్న ఆయన, ఈ వేదిక ద్వారా వారి స్మృతికి నివాళులు అర్పించారు.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కేవలం ఓ గాయకుడు మాత్రమే కాదన్న ఆయన... గతానికి, భవిష్యత్తుకు మధ్య వర్తమాన స్వరాల సారధిగా, సంస్కార వారధిగా వారిని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఎస్పీ బాలూ గురించి ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు.

రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని కైలాష్ ఖేర్ ఆలపించారు. ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినీ నటుడు  తనికెళ్ళ భరణి సహా కె.ఎల్. యూనివర్సిటీ నుంచి పలువురు బాలూ అభిమానులు ప్రత్యక్షంగా,  ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాలు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, 110 తెలుగు అసోసియేషన్లకు చెందిన ప్రతినిధులు అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలక్ష్మికి షాకిచ్చిన హైకోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ