ఇటీవల యుపిలో దళిత యువతిపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే హర్యానాలో మరో యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపిన ఘటన జరిగింది. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు మహిళల భద్రతను సవాలు చేస్తున్నాయి. హర్యానాలో ఒక విద్యార్థినిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.
ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 3.40 గంటలకు ఫరీదాబాద్‌లోని బాలాబ్‌ఘర్ కాలేజీ ఎదుట జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కామర్స్ విద్యార్థిని నిఖిత తోమర్ పరీక్షలు రాసేందుకు కాలేజీకి వచ్చారు. అదే సమయంలో తౌసీఫ్, అతని స్నేహితుడు రేహన్‌లు కారుతో సహా అక్కడ వేచి ఉన్నారు. ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.
దీంతో నిఖిత తీవ్రంగా ప్రతిఘటించడంతో.. గన్‌పాయింట్‌లో ఆమెను షూట్ చేశారు. ఆ వెంటనే వారిద్దరూ పరారు కావడంతో.. ఆమె రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యాలు పక్కనే ఉన్న సిసికెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయువతి మరణించింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
2018లో కూడా ఇదేవిధంగా ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని అన్నారు. తన కుమార్తెకు న్యాయం జరగాలని నిఖితా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేయాలని హర్యానా పోలీసులకు లేఖరాసింది.