Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

Advertiesment
mumbai rains

ఠాగూర్

, మంగళవారం, 19 ఆగస్టు 2025 (10:05 IST)
ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీటమునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 
 
దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రెడ్ అలర్ట్ జారీ చేయడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం సెలవు ప్రకటించింది. సోమవారం కురిసిన వర్షాలకు ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో నీరు చేరడంతో, ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని ఇండిగో ఎయిర్ లైన్స్ సూచించింది.
 
మరోవైపు, ఈ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. గోద్రెజ్ బాగ్ అపార్టుమెంట్ గోడ కూలి సతీష్ టిర్కే (35) అనే వాచ్‌మన్ ప్రాణాలు కోల్పోయాడు. వాల్మీకి నగరులో ఓ వ్యక్తి డ్రైనేజీలో కొట్టుకుపోగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. మరో దారుణ ఘటనలో, పాఠశాల నుంచి కుమారుడిని తీసుకుని వస్తున్న యులోజియస్ సెల్వరాజ్ (40) అనే మహిళ, ఆమె ఏడేళ్ల కుమారుడు ఆంటోనీ బెస్ట్ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.
 
కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం కావడం గమనార్హం. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో ఒకటైన విరార్ సరస్సు సోమవారం మధ్యాహ్నం నిండి పొంగిపొర్లింది. రత్నగిరి, రాయగడ్, హింగోలి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు