నోయిడా ఎక్స్‌ప్రెస్ హైవేపై బీభత్సం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా పదుల సంఖ్యలో వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారులకు గాయాలవడంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ బీభత్సం కారణంగా హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల సంఖ్యలో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకిది వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారు.
మరోవైపు వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకరస్థాయిలో పెరిగిపోయింది. శనివారం వాయు కాలుష్య సమస్య తీవ్రమవడంతో గాలిలో కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల (PM2.5) స్థాయులు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయునాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయుల్లో క్షీణిస్తుండటంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-IIIని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది.
అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా మొదలైన ప్రాంతాల్లో ముఖ్యమైన వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా ఢిల్లీ బయట నమోదు చేసుకున్న అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం.
రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు, రక్షణ రంగాలకు సంబంధించిన నిర్మాణాలు మినహా ఇతర నిర్మాణాలపై నిషేధం.