అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన గంటకు రూ. 90 కోట్లు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో ఆయన వరుసగా తొమ్మిదవ సారి అగ్రస్థానంలో నిలిచారు.
ఆయన సంపద రూ.2.77 లక్షల కోట్ల నుండి రూ. 6.58 లక్షల కోట్లకు పెరిగిన నేపధ్యంలో ఆయనకు ఈ ప్రత్యేకత దక్కింది. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లలోకి భారీగా పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... రిలయన్స్ విలువ భారీగా పెరిగింది.
ఆగస్ట్ 31 తో ముగిసిన పన్నెండు నెలల కాలంలో ముఖేష్ అంబానీ సంపద 73 శాతం పెరిగింది. దీంతో ఆయన సంపద రూ. 6.58 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో రూ. వెయ్యి కోట్లకు మించి సంపద ఉన్న 828 మందిని పరిశీలించారు.
వీరిలో 627 మంది సంపద పెరగగా, మరో 229 మంది సంపద మాత్రం తగ్గింది. కాగా... గతంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 75 మంది ఈసారి చోటు దక్కించుకోలేకపోయారు. ఈ జాబితాలో కొత్తగా 162 మంది చోటు దక్కించుకున్నారు.