ఇద్దరుకు మించి పిల్లలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని ఎన్సీపీ నేత అజితి పవర్ అన్నారు. పూణెలోని బారామతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు దేశ జనాభా 35 కోట్లుగా ఉండేదని మా తాత తరచుగా నాతో చెప్పేవారు. కానీ, ఇపుడు దేశ జనాభా 142 కోట్లకు చేరింది. చైనాను అధిగమించాం. దీనికి మనమందరం బాధ్యులం. మన దేశం, రాష్ట్రాల ప్రగతి కోసం ఒకరిద్దరు పిల్లలు పుట్టాక సంతానం కనడం నిలిపివేయాలి.
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు అవుతారని నిర్ణయం తీసుకున్నారు. అపుడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని బాధపడ్డాను. ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది మన చేతుల్లో లేదు. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. వారికి అధికారాలు నిరాకరించినట్లయితే, ప్రజలు ఈ సమస్యపై మరింత అవగాహన కలుగుతుంది అని ఆయన అన్నారు.