Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చల్లటి కబురు : ప్రవేశించిన నైరుతి - ఈ యేడాది 102 శాతం వర్షంపాతం

చల్లటి కబురు : ప్రవేశించిన నైరుతి - ఈ యేడాది 102 శాతం వర్షంపాతం
, సోమవారం, 1 జూన్ 2020 (16:37 IST)
భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు తెలిపింది. ఈ కారణంగా కేరళ రాష్ట్రంతో పాటు.. తెలంగాణా రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశంలో వర్షాకాలం ఆరంభ‌మైంది. నైరుతీ రుతుప‌వ‌నాలు సోమవారం కేర‌ళ తీరాన్ని తాకిన‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. 
 
ఈ నైరుతి రుతుపవనాల కారణంగా కేర‌ళ‌లో మొత్తం 9 జిల్లాల్లో ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. తిరువ‌నంత‌పురం, కొట్టాయం, పాతాన‌మిట్టం, అల‌ప్పుజా, కొల్లాం, ఎర్నాకుళం, ఇడుక్కి, మ‌ల్ల‌పురం, క‌న్నూరు జిల్లాలో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.
 
దీనిపై మృత్యుంజయ మహాపాత్ర స్పందిస్తూ, ఈ యేడాది అనుకున్న‌ట్లే సాధార‌ణ తేదీల ప్ర‌కారం నైరుతీ .. కేర‌ళ తీరాన్ని తాకిందని తెలిపారు. నైరుతీ రుతుప‌వ‌నాల వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌కాలంలో 75 శాతం వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. 
 
అరేబియా స‌ముద్రంలో నిస‌ర్గ తుఫాన్ ఏర్ప‌డ‌డంతో.. నైరుతీ రాక ఈజీగా మారిన‌ట్లు ఐఎండీ అంచ‌నా వేస్తున్న‌ది. ఈ ఏడాది నూరు శాతం సాధార‌ణ వ‌ర్ష‌పాతం ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు ఏప్రిల్‌లోనూ కేంద్ర భూగ‌ర్భ మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి మాధ‌వ‌న్ రాజీవ‌న్ తెలిపారు.
 
మరోవైపు, ఈ ఏడాది వ‌ర్షాలు స‌మృద్ధిగా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వ‌ర్షాలు కురిసేందుకు.. ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్న‌ట్లు కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ మాధ‌వ‌న్ నాయ‌ర్ రాజీవ‌న్ తెలిపారు. 
 
జూన్ నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య నైరుతీ రుతుప‌వ‌నాలు వ‌ల్ల ఈ సారి 102 శాతం వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  అంటే సుమారు 88 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం కురుస్తుంద‌ని తెలిపారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- 12 మంది మృతి