Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోల్‌కతా మురికివాడలో మొఘల్‌ యువరాణి.. టీస్టాల్‌లో మగ్గిన రాజరికం

రాజరికాలు, రాణి వాసాలు దూరమైతే ఎంత మహరాజులైనా, మహరాణులైనా, వారి వారసులైనా సామాన్యుల మాదిరే కష్టభూయిష్టమైన జీవితం గడవపాల్సి ఉంటుందనే సత్యాన్ని ఈ మొఘల్ యువరాణి తన జీవితం సాక్షిగా దేశం ముందు ప్రదర్శిస్తు

కోల్‌కతా మురికివాడలో మొఘల్‌ యువరాణి.. టీస్టాల్‌లో మగ్గిన రాజరికం
హైదరాబాద్ , గురువారం, 8 జూన్ 2017 (06:33 IST)
రాజరికాలు, రాణి వాసాలు దూరమైతే ఎంత మహరాజులైనా, మహరాణులైనా, వారి వారసులైనా సామాన్యుల మాదిరే కష్టభూయిష్టమైన జీవితం గడవపాల్సి ఉంటుందనే సత్యాన్ని ఈ మొఘల్ యువరాణి తన జీవితం సాక్షిగా దేశం ముందు ప్రదర్శిస్తున్నారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసురాలు సుల్తానా బేగం ఇప్పుడు దేశంలో జీవిస్తున్న ఆ వంశపు చివరి మనిషి కావడం విశేషం. కోల్‌కతాలో ఒక మురికివాడలో రెండు గదుల ఇంట్లో ఉంటున్న సుల్తానా బేగం నెలకు ఆరువేల ఫించన్‌తో బతుకుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతున్నా, రాజ్యాలు పొగొట్టుకుని దేశంలోనే అనాధలైన ప్రతి రాజరిక వారసులదీ ఇదే బతుకు చిత్రం కావడం విషాదం..
 
మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌కు బహదూర్‌షా జఫర్‌ మునిముని మనవడు. ఆ బహదూర్‌ షా మునిముని మనవడి భార్య సుల్తానా బేగం. బ్రిటీష్‌ వారిపై 1857లో జరిగిన తిరుగుబాటుకు బహదూర్‌ షా అనధికారికంగా నాయకత్వం వహించారు. తిరుగుబాటు సేనలు మొదట్లో బ్రిటిష్ సేనలను ప్రతిఘటించినా ఉత్తర భారతంలోని ఇతర సంస్థానాలు సహాయం చేయకపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం  తిరుగుబాటును క్రూరంగా అణిచివేసింది. యుద్ధంలో ఓడిపోయి ఖైదీగా పట్టుబడిన బహదూర్ షా జీవితాంతం రంగూన్‌ కారాగారంలో గడిపారు. తిరుగుబాటు విఫలమవడంతో మొఘల్‌ చక్రవర్తి పరివారంలో చాలా మంది హతమయ్యారు. సుల్తానా బేగం భర్త ముత్తాతతో సహా మరి కొందరు తప్పించుకు బయటపడ్డారు.
 
బ్రిటీష్‌ ప్రభుత్వం తమను వేధిస్తుందనే భయంతో మొఘల్‌ చక్రవర్తి వారసులు కొందరు వేరే దేశాలు పారిపోయారు. కొందరు అమెరికాలోని డెట్రాయిట్‌, పాకిస్థాన్‌లో ఉంటున్నారు. అయితే సుల్తానా భర్త మహమ్మద్‌ బేదర్‌ భక్త్‌ భారత్‌లోనే ఉండిపోయాడు. కొన్నాళ్లకు ఆయన కన్నుమూయడంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని సుల్తానా అప్పట్లో సోనియాగాంధీకి లేఖ రాశారు. 2003లో కేంద్రం ఆమెకు 50 వేలు, అపార్ట్‌మెంట్‌, పింఛన్‌ మంజూరు చేసింది. 
 
కానీ ఆ చిన్న అపార్ట్‌మెంట్ నుంచి కూడా గూండాలు వెళ్లగొట్టడంతో ఆమె వీధుల పాలయ్యారు. ఆరుగురు సంతానంతో కోల్‌కతా లోని మురికివాడలోని రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు. కొన్నాళ్లు టీ స్టాల్‌ నడిపినా..దాన్ని మూసేయడంతో భారత ప్రభుత్వం ఇచ్చే పింఛనే ఇప్పుడు ఆమెకు, ఆమె ఆరుగురు పిల్లలకు ఆధారం. ‘‘ప్రభుత్వం తాజ్‌మహల్‌, ఎర్రకోట సందర్శకులనుంచి కోట్లు ఆర్జిస్తున్నది. నాకు భోగభాగ్యాలు ఇవ్వమని అడగడం లేదు. పేదరికం నుంచి బయటపడేయమని కోరుతున్నాను’’ అంటున్నారు సుల్తానా బేగం.
 
భారత ప్రభుత్వం ఆమె విన్నపాన్ని వినగలుగుతుందా.. ఈ మొఘల్ మాజీ యువరాణికి, ఆమె పిల్లలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని కల్పించగలుగుతుందా?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలు హీరోల్లా చూస్తారని ఉగ్రవాదుల్లో చేరతారా నాన్నా..!