పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఎమ్మెల్యే పురుడు పోశారు. ఎమ్మెల్యే సమయానికి స్పందించడంతో.. బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన మిజోరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిజోరంలోని చాంఫై నార్త్ ఎమ్మెల్యే జడ్‌ఆర్ థైమ్సంగా సోమవారం తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు.
ఇటీవల సంభవించిన భూకంపాలు, కరోనా వైరస్ తీవ్రతతో పాటు ఇతర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలోనే నాగూర్ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది.
వృత్తిరీత్యా గైనకాలజీస్ట్ అయిన థైమ్సంగా చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్ చేశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు.