భారతదేశంలో తాను ఓ జాత్యహంకార బాధితుడుని : మిజోరాం ముఖ్యమంత్రి
మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో నివశించే ప్రజలే తమ దేశ ప్రజల నుంచి జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారనీ, అలాంటి బాధితుల్లో తాను ఒకడినని గుర్తు చేశారు.
మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో నివశించే ప్రజలే తమ దేశ ప్రజల నుంచి జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారనీ, అలాంటి బాధితుల్లో తాను ఒకడినని గుర్తు చేశారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈశాన్య భారతదేశ ప్రజలు స్వదేశంలోని పలు ప్రధాన నగరాల్లో జాత్యహంకారానికి బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మనదేశంలో జాత్యహంకారం అత్యంత నీచమైనదని, తాను స్వయంగా అనేకసార్లు ఈ దురహంకారానికి గురయ్యానని తెలిపారు. సుమారు 20-25 సంవత్సరాల క్రితం తాను ఓ విందుకు హాజరయ్యానని, అక్కడ ఓ వ్యక్తి తనతో మాట్లాడుతూ ‘‘మీరు భారతీయుడిలా లేరు’’ అన్నాడని చెప్పారు. అందుకు తాను బదులిస్తూ ‘‘భారతీయుడు ఎలా కనిపిస్తాడో ఒక వాక్యంలో చెప్పు’’ అని తాను అడిగినట్లు తెలిపారు. సామాన్యులు మాత్రమే కాదని, జాతీయ స్థాయి నాయకులకు కూడా, వారు బీజేపీవారైనా, కాంగ్రెస్‌వారైనా, దేశం గురించి తెలియదన్నారు.
ప్రపంచంలోని ప్రధాన జాతులు భారతదేశంలో ఉన్నట్లు జాతీయ నేతలకు తెలియదన్నారు. దక్షిణాదిలో ద్రావిడులు, ఉత్తరాదిలో ఆర్యులు, ఈశాన్యంలో మంగోలులు ఉన్నట్టే దేశంలో అనేక ఆదివాసీ జాతులకు చెందిన ప్రజలు కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయవాదం అత్యధికంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. కాగా, 74 ఏళ్ళ వయసుగల తన్హావ్లా మిజోరాం ముఖ్యమంత్రిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టారు.