దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ క్యాబ్స్‌పై సుప్రీంకోర్టు నిషేధం విధించడాన్ని క్యాబ్స్ డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉత్తర్వులకు నిరసనగా డ్రైవర్లు సోమవారం ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు దిగారు. దీంతో హస్తిన స్తంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలోని రాజోక్రి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో దౌలాకువాన్ నుంచి గుడ్‌గావ్ వెళ్లే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు గుడ్‌గావ్-దౌలాకువాన్ రోడ్డుపై పాత దిల్లీ టోల్ బూత్ వద్ద రహదారులు దిగ్బంధించారు.
రోడ్లపై దాదాపు కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీలో కాలుష్యనియంత్రణ కోసం డీజిల్ వాహనాలను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాహనాలను డీజిల్ నుంచి సీఎన్‌జీకి మార్చుకోవడానికి ఇంకా సమయం కావాలని పెట్టుకున్న పిటిషన్‌ను శనివారం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో మే 1వ తేదీ నుంచి డీజిల్‌తో నడిచే క్యాబ్స్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా ఈ పరిస్థితి నెలకొంది.