పుల్వామా ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాలు నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. పుల్వామా ఘటనపై పాకిస్థాన్ స్పందించిన తీరును మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. పుల్వామా దాడికి తామే బాధ్యులమని కూడా జైషే ప్రకటించింది.
''నువ్వు జైషే మొహమ్మద్ కాదు... జైషే సైతాన్‌వి. మసూద్... నువ్వు మౌలానావి కాదు. సైతాన్‌వి. అది లష్కరే తొయిబా కాదు, లష్కరే సైతాన్" అంటూ పాక్ ఉగ్రసంస్థలపై ఒవైసీ నిప్పులు చెరిగారు.
పాకిస్థాన్ ప్రధాని అమాయకత్వం ముసుగు వీడాలని భారత్ తరఫున తాను కోరుతున్నానని ఓవైసీ వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమాయకత్వం నటిస్తున్నారని విమర్శించారు. పుల్వామా దాడి భారత్‌పై జరిగిన తొలి దాడి ఏమీ కాదని, పఠాన్ కోట్, ఉరి ఘటనలు అంతకుముందు జరిగాయనే విషయాన్ని గుర్తు చేశారు.
1947లో జిన్నా ప్రతిపాదిత దేశ విభజనను వ్యతిరేకించి ఐచ్ఛికంగానే ఇండియన్ ముస్లింలు ఈ దేశంలో ఉండిపోయారని ఒవైసీ గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం ఇండియా విధానమని, భారతదేశ పౌరులంతా కలిసిమెలిసి ఉండటం చూసి పాక్ కుళ్లుకుంటోందని విమర్శించారు.
పుల్వామా పాశవిక దాడికి సంబంధించి పాక్ ఉగ్రవాద సంస్థ జైషే పాత్రపైనా ఒవైసీ విరుచుకుపడ్డారు. మొహమ్మద్‌ను నమ్మేవారెవరూ ఏ ఒక్కరినీ చంపరని అన్నారు. పుల్వామా దాడితో పాకిస్థాన్‌కు లింకులు వున్నాయి. పాక్ సర్కారు, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ పథకం ప్రకారమే దాడి జరిగిందని.. మా జవాన్లు 40 మందిని జైషే పొట్టన బెట్టుకుందని ఓవైసీ మండిపడ్డారు.