భారత్‌లో పలు ఉగ్రదాడుల సూత్రధారి, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ తమ దేశంలోనే ఉన్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటించారు. అతడు పాకిస్థాన్‌లో వున్నాడని.. అయితే తీవ్ర అనారోగ్యంతో వున్నట్లు తెలిపారు. పుల్వామా దాడి గురించి జైషే ఉగ్రవాద సంస్థల నాయకులను సంప్రదించామని.. వారు ఈ దాడి చేయలేదని చెప్పారు.
నిషేధిత ఉగ్రసంస్థ జైషే సంస్థ నాయకులతో పాక్ ప్రభుత్వం టచ్‌లోనే ఉందని ఆయన అంగీకరించారు. జైషే ఉగ్రవాద సంస్థ నాయకులను సంప్రదించామని, పుల్వామా ఉగ్రదాడికి తాము పాల్పడలేదని ఆ సంస్థ తమతో చెప్పినట్లు తెలిపారు.
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ఖురేషి స్పందిస్తూ.. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని చెప్పారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు జైషే సంస్థ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి భిన్నంగా ఖురేషి సమాధానం ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.