ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్‌కు నివాళి అర్పించారు. కరోనా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న ఆయన.. తదనంతరం అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఆయనను కాపాడుకోవడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారని, అవి విజయవంతం కాలేకపోవడం తనను కలచి వేసిందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రీడాకారులందరూ మిల్ఖా సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించనున్న నేహా గోయెల్, ప్రవీణ్, దీపికా కుమారి, ప్రియాంక, శివ్‌పాల్ సింగ్, చిరాగ్ షెట్టి, సాత్విక్, మనీష్ కౌశిక్, సీఏ భవానీదేవి వంటి క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ గురించి ప్రస్తావించిన ప్రతీసారీ మిల్ఖాసింగ్‌ను ప్రస్తావించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని మోడీ సూచించారు. ప్రతి విభాగంలోనూ పతకాలను సాధించాలనే అకాంక్షను వ్యక్తం చేశారు.
సాత్విక్ స్వయంగా కరోనా వైరస్ బారిన పడినప్పటికీ.. అందులో నుంచి కోలుకున్నారని, ఒలింపిక్స్‌కు సిద్ధమౌతోన్నారని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని గుర్తు చేశారు. క్రీడాకారులతో పాటు దేశ ప్రజలందరూ వ్యాక్సిన్లను వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ పట్ల ప్రజల్లో ఇంకా కొన్ని భ్రమలు ఉన్నాయని, వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల్లో నెలకొన్న భ్రమలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.