గత మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రం నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కోరారు. ఈ చర్య రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.
మణిపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆమెను కోరారు. రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిసినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు సుస్మితా దేవ్ మణిపూర్ మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరారు. అదేవిధంగా మణిపూర్ ఘటనలపై పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని అడగాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు.
'మణిపూర్‌లో వేర్వేరు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి సూచించాం. ఈ చర్య రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సరిదిద్దేందుకు ఉపయోగకరంగా ఉంటుంది' అని సుస్మితా దేవ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, జేడీయూ నాయకుడు రాజీవ్ రంజన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శివసేన (యూబీటీ) నాయకులు అర్వింద్ సావంత్, సంజయ్ రౌత్, టీఎంసీ నాయకులు సుదీప్ బంధోపాధ్యాయ, డెరెక్ ఒబ్రెయిన్‌లు తదితరులు ఉన్నారు.