ఢిల్లీ బాలికపై తెలంగాణా రాష్ట్రంలోని హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఆ బాలికను ఢిల్లీ నుంచి హన్మకొండకు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ రెడ్డి కాలనీకి చెందిన నూనె మురళీకృష్ణ డిగ్రీ పూర్తి చేసి జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన పదో తరగతి చదువుతున్న 16 యేళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. రెండు నెలల క్రితం సదరు బాలికను మురళీకృష్ణ హన్మకొండకు పిలిపించి తన గదిలో బంధించి వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే ఇంట్లో తన కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఢిల్లీలో రాణిగంజ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాలిక ఫోన్‌కు హన్మకొండలో ఉంటున్న మురళీకృష్ణ ఫోన్ నుంచి తరుచుగా ఫోన్ కాల్స్ వచ్చినట్టు గుర్తించారు.
జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసును హన్మకొండకు మార్చారు. బాలిక తల్లిదండ్రులు ఈ నెల 14న హన్మకొండకు వచ్చి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఉంటే పోలీసులు పట్టుకుంటారని గమనించిన మురళీకృష్ణ.. బాలికను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాడు.
ఆ తర్వాత వారి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు వారిపై నిఘా పెంచగా, తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసు బృందాలు అక్కడికివెళ్లి మంగళవారం అదుపులోకి తీసుకుని హన్మకొండకు తీసుకువచ్చారు. మురళీకృష్ణను విచారించగా చేసిన తప్పును అంగీకరించాడు. దీంతో నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.