Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండియా కూటమికి బీటలు? ఒంటరి పోటీకి సీఎం మమతా బెనర్జీ మొగ్గు

mamata benerjee

వరుణ్

, బుధవారం, 24 జనవరి 2024 (15:31 IST)
కాంగ్రెస్ సారథ్యంలోని కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమికి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఆటంకాలు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 42 ఎంపీ సీట్లకు అభ్యర్థులను బరిలోకి దించుతుందని ఆ పార్టీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇదేవిషయంపై ఆమె మాట్లాడుతూ, కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. 
 
కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతామన్నారు. బెంగాల్‌లోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఎంసీ పోటీ చేస్తుందని వివరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులపై, ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. 
 
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపైనా ఆమె విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లోకి యాత్ర ప్రవేశించబోతుందని గుర్తుచేస్తూ కూటమి భాగస్వామిగా ఉన్న తమకు మర్యాదపూర్వకంగా కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. దీంతో రాహుల్ గాంధీ యాత్రలో మమత పాల్గొనడం సందేహాస్పదంగా మారింది. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మెజారిటీ ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీపై ఐక్యంగా పోరాడాలనే నిర్ణయంలో భాగంగా ఈ కూటమి ఏర్పడింది. కూటమిలోని ప్రధాన పార్టీలలో ఒకటిగా టీఎంసీ వ్యవహరించింది. పలుమార్లు చర్చల అనంతరం కూటమిలో ప్రస్తుతం సీట్ల పంపకాలపై కసరత్తు జరుగుతోంది. ఈ విషయంలోనే కాంగ్రెస్, టీఎంసీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్.షర్మిల రాకతో సీఎం జగన్ పనైపోయింది... : విష్ణుకుమార్ రాజు