పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇందుకోసం ఆమె శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్య అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. భవానీపూర్‌తో పాటు పశ్చిమబెంగాల్‌లోని షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా తృణమూల్ నుంచి బీజేపీలోకి వెళ్లి బీజేపీ తరఫున బరిలో దిగిన సువేందు అధికారిని ఓడించడమే లక్ష్యంగా ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో మమతాబెనర్జి కేవలం 1900 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం మెజారిటీ స్థానాలు సాధించింది. దాంతో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మమతాబెనర్జి సీఎం పదవిని స్వీకరించారు. ఆ పదవిలో కొనసాగాలంటే ఆమె ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అందుకే ఇప్పుడు భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.
మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్‌ను బరికిలోకి దింపింది.
ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. 41 ఏళ్ల ప్రియాంక తిబ్రీవాల్ కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2014లో ఎంపీ బాబుల్ సుప్రియో నేతృత్వంలో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.