తమిళనాడు ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగారం చోరీ కేసులో విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన నిందితుడు లాకప్‌లో చనిపోయాడు. నిందితుడుని పోలీసులు కర్రలతో చావబాదడం వల్లే ఈ దారుణం జరిగిందని పోస్టుమార్టం నివేదిక సైతం నిర్ధారించింది. నిందితుడుని ఇద్దరు పోలీసులు కర్రలతో చావబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు. పోలీసులు సైతం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
పైగా, ఈ కేసు విచారణ సమయంలో మద్రాస్ హైకోర్టు సైతం పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హంతకులు సైతం ఇలా కొట్టరంటూ వ్యాఖ్యానించింది. కస్టడీలో ఉన్న వ్యక్తి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. చివరికి హంతకులు కూడా ఈ స్థాయిలో దాడి చేయరంటూ పోలీసులపై మండిపడింది. ఈ ఘటనపై విచారణ జరిపి జూలై 8వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని జడ్జిని ఆదేశించింది. అలాగే, సాక్ష్యాధారాలన్నింటినీ దర్యాప్తు బృందానికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లాలో అజిత్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే భద్రకాళి అమ్మన్ ఆలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 కేజీల బంగారం చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని వించారించారు. అయితే, విచారణలో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అజిత్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు దారుణంగా కొట్టడం వల్లే అజిత్ చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక కూడా అజిత్‌పై చిత్రహింసలు నిజమేనని తేల్చింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా స్పందించారు.