బంగారం. దొంగల భయంతో బంగారాన్ని చాలామంది పాతదిండ్లు, మంచాల కింద, బియ్యం డ్రమ్ములు, పాత పుస్తకాల అలమరాలు... ఇలా ఎక్కడైతే పనికిరాకుండా పాతవి వుంటాయో అక్కడ దాచి పెడుతుంటారు. మధురైలో తంగం అనే మహిళ తన కుమార్తె వివాహం కోసం కొనుగోలు చేసిన 25 తులాల బంగారాన్ని జాగ్రత్తగా ఎక్కడ దాచాలా అని ఆలోచించి చివరికి పాత మంచంపైన మట్టిగొట్టుకుపోయి వున్న దిండులో ఆ బంగారాన్ని దాచింది. వివాహం కనుక ఇంటిని శుభ్రం చేయడంతో గంపెడు చెత్త వచ్చింది.
ఈ పాత దిండు వెక్కిరిస్తూ కనబడుతుండటంతో దాన్ని కూడా చెత్తతో కలిపి చెత్తబుట్టలో పడేసారు. ఈ విషయాన్ని తంగం గమనించలేదు. ఉదయాన్నే పాత దిండుకోసం వెతుకులాడగా అది కనిపించలేదు. ఏమైందని అడిగితే... దాన్ని చెత్తబుట్టలో పడవేశామని బంధువులు చెప్పారు. విషయం విన్న తంగం ఆందోళనతో చెత్తను తీసుకెళ్లే పారిశుద్ధ్య కార్మికులను సంప్రదించింది.
అప్పటికే వారు తమకు దొరికిన ఆ బంగారాన్ని హెల్త్ సూపర్ వైజర్ కి అప్పగించారు. నగల కోసం వచ్చిన తంగంకు సిబ్బంది వాటిని అందజేసారు. తన కుమార్తె కోసం దాచుకున్న నగలు తిరిగి దొరికినందుకు, వాటిని తనకు నిజాయితీతో అప్పగించిన కార్మికులకు తంగం కృతజ్ఞతలు తెలియజేసింది.