ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే వ్యాక్సిన్లు వేసుకోవాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో అనేక మంది అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నా యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) ఉత్పత్తి కాలేదని లక్నోకు చెందిన ప్రతాప్ చంద్ర ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలాపై కేసు పెట్టాడు. ఆయనతో పాటు డీసీజీఏ డైరెక్టర్, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణా ఉపాధ్యాయ్‌ల పేర్లనూ ఫిర్యాదులో చేర్చాడు.
ఆయన చేసిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తే, ఏప్రిల్ 8న తాను కొవిషీల్డ్ మొదటి డోసు టీకా తీసుకున్నానని, ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు తీసుకోవాల్సి ఉన్నా టికా డోసుల మధ్య విరామం కేంద్రం ఆరు వారాలకు పెంచింది. ఆ తర్వాత దానిని 12 వారాలకు పెంచింది. ఒక్క డోసు తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ చెప్పినా.. తనకు మాత్రం ఏమంత మంచిగా అనిపించట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పైగా, ప్రభుత్వ అనుమతి ఉన్న ల్యాబ్‌లో పరీక్ష చేయించుకుంటే యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని తేలిందని వెల్లడించాడు. దానికి బదులు తన ప్లేట్ లెట్లు (రక్త ఫలకికలు) 3 లక్షల నుంచి లక్షన్నరకు పడిపోయాయని అందులో పేర్కొన్నాడు. దీంతో తనకు కరోనా ముప్పు మరింత పెరిగిందని ఆరోపించాడు.
పోలీసులు అతడి నుంచి ఫిర్యాదు తీసుకున్నా.. ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదు. సున్నితమైన విషయం కావడంతో ఉన్నతాధికారులకు దీనిపై సమాచారమిచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఎఫ్ ఐఆర్ నమోదు చేయకుంటే తాను కోర్టుకు వెళతానని ప్రతాప్ చంద్ర హెచ్చరించాడు.